వడ్డీ రేట్ల కోతతో హైదరాబాద్ అనుకూలం
నగరంలో ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి 30శాతంలోనే
నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదిక విశ్లేషణ
సాక్షి, హైదరాబాద్: వడ్డీ రేట్లలో భారీ కోతలతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభిస్తున్న తరుణంలో..హైదరాబాద్ ఇళ్ల కొనుగోలుకు ఇప్పటికీ అనుకూలమైన నగరంగా కొనసాగుతోంది. ఆర్‌బీఐ ఫిబ్రవరి 2025 నుంచి రెపో రేటును వరుసగా తగ్గిస్తూ మొత్తంగా 125 బేసిస్ పాయింట్లు కోత విధించి 5.25 శాతానికి తీసుకురావడం వల్ల గృహ రుణాలపై ఉన్న భారం గణనీయంగా తగ్గింది. దీని ప్రభావంగా హైదరాబాద్‌లో గృహ రుణ ఈఎంఐలు కుటుంబ ఆదాయంలో సగటున 30 శాతం మేరకే పరిమితమైంది. ఐటీ, ఫార్మా, సేవా రంగాల్లో ఉద్యోగావకాశాల విస్తరణతో ఆదాయాలు స్థిరంగా పెరుగుతుండటమే హైదరాబాద్‌కు ప్రధాన బలంగా మారింది.
ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘జింగ్ అఫర్డబిలిటీ ఇండెక్స్ 2025’ నివేదికలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహ కొనుగోలు సామర్థ్యాన్ని విశ్లేషించింది. హైదరాబాద్‌లో నివసించే కుటుంబాలు తమ ఆదాయంలో 30 శాతం వరకే ఈఎంఐలపై వెచి్చస్తుండడం గృహాల కొనుగోళ్లకు అవకాశాన్నిచ్చే అంశంగా పేర్కొంది. హైదరాబాద్ కన్నా తక్కువగా ఇతర నగరాల్లోని కుటుంబాలు ఈఎంఐల కోసం వెచ్చిస్తున్నా, పెరిగిన హైదరాబాద్ విస్తీర్ణం, పెట్టుబడులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీల దృష్టి ఉండడం ఈ నగరానికి అనుకూల అంశంగా రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో నిర్మిస్తున్న 30 నుంచి 50 అంతస్తులకుపైగా గల స్కైరైజ్ భవనాలు ఒకవైపు ఉంటే.. అందుబాటు ధరల్లో నివాసాలు లభ్యమవుతుండడం వల్ల హౌసింగ్‌కు అనుకూలమైనదిగా పేర్కొంటున్నారు. విస్తరిస్తున్న కొత్త పరిశ్రమలకు తోడు ఐటీ, ఫార్మా, సేవా రంగాల్లో పెరుగుతున్న ఉద్యోగాల వల్ల హౌసింగ్ రంగం ఇక్కడ అందుబాటులో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
ఆయా నగరాల్లో ఇలా...
నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా అఫర్డబిలిటీ ఇండెక్స్ నివేదిక ప్రకారం అహ్మదాబాద్ దేశంలోనే కుటుంబాల గృహాల కొనుగోలుకు అత్యంత అనువైన నగరంగా నిలిచింది. అక్కడ ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి కేవలం 18 శాతం మాత్రమే ఉంది.
⇒ పుణే, కోల్‌కతా నగరాల్లో ఈ నిష్పత్తి 22 శాతం ఉండగా, బెంగళూరులో 27 శాతంగా ఉండగా చెన్నైలో 23 శాతానికి తగ్గడం దక్షిణాదిలో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతుంది.
⇒ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలో 2025లో కీలక మార్పు చోటు చేసుకుంది. అక్కడ గృహ రుణ ఈఎంఐ–ఆదాయ నిష్పత్తి తొలిసారిగా 47 శాతానికి తగ్గింది. ముంబైలో 50 శాతం కన్నా దిగువకు అఫర్డబిలిటీ రేట్ రావడం తొలిసారిగా నైట్‌ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
⇒ దేశ రాజధాని ప్రాంతం ఎన్‌సీఆర్ (ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా పరిసరాలు)లో మాత్రం భిన్న పరిస్థితి కనిపిస్తోంది. లగ్జరీ, ప్రీమియం గృహ విభాగాల్లో డిమాండ్ పెరగడంతో అక్కడ సగటు ఇళ్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇక్కడ 2024లో అఫర్డబిలిటీ ఇండెక్స్ 27 శాతం ఉండగా, 2025లో 28 శాతానికి పెరిగింది. అయినా, ఇది ఇంకా ఆమోదయోగ్య స్థాయిలోనే ఉందని నైట్ ఫ్రాంక్ స్పష్టం చేసింది.


