డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పేదల ముఖంలో ఆనందమే మా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి
నేలకొండపల్లి: గత పాలకులు ప్రజలపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపినా.. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఆపకుండా కొనసాగిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనంతనగర్‌లో రూ.2.25 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శనివారం ఆయన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ.1.75 కోట్లతో నిర్మించనున్న మరో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రైతుల కోసం ప్రతీ సంవత్సరం రూ.13,500 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు.
96 లక్షల పేద కుటుంబాలకు మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని వివరించారు. గత సర్కారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేస్తే.. తాము ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
సన్న ధాన్యానికి దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ధనిక రాష్ట్రమైన తెలంగాణను గత పాలకులు దోచుకుని రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని విమర్శించారు. పేదల ముఖంలో ఆనందం చూడాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వెల్లడించారు.
విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తున్న
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి


