బడంగ్‌పేటను జోన్‌గా ఏర్పాటు చేయాలి
మీర్‌పేట: అన్ని ప్రాంతాలకు అందుబాటులో నడిబొడ్డున ఉన్న బడంగ్‌పేట కేంద్రంగా నూతన జోన్ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు కొలన్ శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బాలాపూర్ చౌరస్తాలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఐఎం మెప్పు కోసం, రాజకీయ స్వార్థంతో కాంగ్రెస్ ప్రభుత్వం డివిజన్లను అనుకూలంగా విభజించిందని ఆరోపించారు. ఎక్కడో దూరాన ఉన్న శంషాబాద్ జోన్‌లో బడంగ్‌పేట, మీర్‌పేట, జల్‌పల్లి, ఆదిబట్ల, తుర్కయంజాల్‌ను కలిపి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తగదని అన్నారు. అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్, సొంత భవనం, రవాణా సదుపాయం ఉన్నందున ప్రభుత్వం పునఃసమీక్షించి బడంగ్‌పేటను జోన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల బడంగ్‌పేటను చార్మినార్ జోన్‌లో విలీనం చేసిన అంశంపై బీజేపీ వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాల ఫలితంగానే ప్రభుత్వం తలొగ్గి చార్మినార్ నుంచి బడంగ్‌పేట, మిగతా ప్రాంతాలను తొలగించిందని గుర్తుచేశారు. జోన్ సాధనకు నేటి నుంచి ఉద్యమ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఎడ్ల మల్లేష్ ముదిరాజ్, యువమోర్చా నాయకుడు రాఘవేందర్‌గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకుడు శ్రీనివాసాచారి పాల్గొన్నారు.


