ఆలస్యంగా వర్షాలు తక్కువ విస్తీర్ణానికి రైతన్నల ఏర్పాట్లు కాలం కలిసి రావడంతో మరింత సాగుకు సన్నాహాలు వరి నారు కొరతతో తిప్పలు
ఇతను ముస్తాబాద్‌కు చెందిన సుంచు దేవయ్య. మూడున్నర ఎకరాలు ఉంది. ఎల్‌నినో ప్రభావంతో బోరును నమ్ముకొని ఎకరంన్నరలోనే వరినాట్లు వేశాడు. ఇటీవల భారీ వర్షాలతో మానేరు ప్రాజెక్టు నిండిందని, బోరులోకి పుష్కలంగా నీరు వచ్చిందని ఆనందపడ్డాడు. మిగతా రెండు ఎకరాలను ట్రాక్టర్‌తో దున్ని నాట్లకు సిద్ధం చేశాడు. కానీ వరినారు దొరకలేదు. నీళ్లున్నా నారు దొరక్క బీడుగా పెట్టేశాడు.
ముస్తాబాద్(సిరిసిల్ల): ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడవని ఉన్న భూమిలో సగమే సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు దిగులు చెందుతున్నారు. వానాకాలం సీజన్ మొదట్లో వర్షాలు కురువకపోవడంతో పలువురు రైతులు వరినార్లు తక్కువగానే పోసుకుని, నాట్లు వేసుకున్నారు. అయితే ఇటీవల వర్షాలు కురిసి ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరడంతో మిగతా భూమిలో వరిపంట వేసేందుకు రైతులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ వరినారు దొరక్క ఇబ్బందిపడుతున్నారు. ఎకరానికి సరిపడే వరినారు కావాలంటే తక్కువకు తక్కువగా రూ.2వేలు పెట్టాల్సి వస్తోంది. అయినా దొరకడం లేదు. దీంతో జిల్లాలో ముప్పై శాతానికి పైగా భూములు ఖాళీగానే కనిపిస్తున్నాయి.
నీళ్లున్నా అదును దాటింది
జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు వద్దని అధి కారులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా అవగాహన కల్పించారు. మరోవైపు వరి విత్తనాలు కూడా దుకాణాల్లో అందుబాటులో లేవు. దీంతో రైతులు తమకున్న భూమిలో సగమే సాగుచేశారు. వర్షాలు కురవడంతో కొన్ని గ్రామాల్లో రైతులు ధైర్యం చేసి నారు సిద్ధం చేసుకున్నారు. వీరి దగ్గర ఉన్న నారుకు డిమాండ్ ఉంది. అయితే అది కూడా తక్కువగానే ఉండడంతో సరిపోవడం లేదు. ఇప్పుడు వరి వేసే ప్రయత్నాలు మానుకోవాలని అనుభవం ఉన్న రైతులు చెబుతున్నారు. అదును దాటిందని, చిన్న పుష్యమి వచ్చిందని పేర్కొంటున్నారు.
వరి సాగు ఇలా..
సాధారణ విస్తీర్ణం : 1.44 లక్షల ఎకరాలు
ఇప్పటి వరకు వరి సాగు : 80 వేల ఎకరాలు
బీడుగా ఉన్న భూములు : 64 వేల ఎకరాలు


