అన్ని వసతులు ఉండాలి
● జేఎన్‌టీయూ కళాశాలలో విద్యార్థుల అవస్థలు
● తగ్గిన అడ్మిషన్లు
వేములవాడఅర్బన్: నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అంది మెరుగైన ఉపాధి దొరుకుతుందని ఆశతో వస్తున్న విద్యార్థులకు కళాశాలలో అరకొర వసతులు, అధ్యాపకుల కొరతతో ఇబ్బంది కలుగుతోంది. వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2020–21లో తాత్కాలికంగా జేఎన్‌టీయూ కళాశాలను ప్రారంభించిన నాటి నుంచి విద్యార్థులకు అరకొర వసతులతోనే బోధన అందుతోంది. సరైన తరగతి గదులు, ల్యాబ్‌లు, అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు.
● తగ్గిన అడ్మిషన్లు
జేఎన్‌టీయూ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యార్థుల సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. వసతులు సక్రమంగా లేకపోవడం కూడా కారణమవుతోంది. కళాశాలలో ఇప్పటివరకు ఇంజినీరింగ్ అన్ని గ్రూపుల్లో మొదటి సంవత్సరం 130 మంది సీట్లు భర్తీ అయ్యాయి, రెండో సంవత్సరం 258, మూడో సంవత్సరం 247 మంది, నాల్గో సంవత్సరం 313 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 948 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అరకొర వసతులతో అడ్మిషన్లు తగ్గుతున్నాయని అంటున్నారు.
● 8 తరగతి గదులే..
జేఎన్‌టీయూ కళాశాలకు సుమారుగా 20 గదులు ఉండాల్సి ఉండగా 8 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. పూర్తిస్థాయి ల్యాబ్‌ల సౌకర్యం లేకపోవడంతో ఒక్కో ల్యాబ్‌లో షిప్టుల వారీగా నిర్వహిస్తున్నారు. కొంత మందిని ల్యాబ్ కోసం కొండగట్టు జేఎన్‌టీయూ కళాశాలకు తరలిస్తున్నారు. చుట్టు పక్క ప్రాంతాల నుంచే విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినాలంటే చెట్ల కింద తినాల్సిన పరిస్థితి ఉంది.
● అధ్యాపకుల కొరత
కళాశాలలో రెగ్యూలర్ పోస్టులు రెండు. ఒకటి ప్రిన్సిపాల్, ఒకటి ప్రోఫెసర్ మాత్రమే ఉన్నాయి. మిగత పోస్టులు 10 మంది కాంట్రాక్ట్, 35 మంది గెస్ట్‌ఫ్యాకల్టీ ఉన్నారు. కనీసం స్టాఫ్‌కు రూమ్ లేక ల్యాబ్ గదులు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చుంటున్నారు.
● ప్రారంభం కాని సొంత భవన నిర్మాణ పనులు
జేఎన్‌టీయూ కళాశాలకు సొంత భవనం నిర్మించేందుకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో 20 ఎకరాల భూమి కేటాయించారు. కానీ ఇప్పటి వరకు నిర్మాణ పనులు చేపట్టలేదు. కళాశాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్‌ల ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్లినా పనులు ప్రారంభించకపోవడంతో ఇబ్బందిగా మారింది.
● అద్దె భవనాల్లో హాస్టల్
కళాశాలకు కొంత దూరంలో ఆరు అద్దె భవనాలను అద్దెకు తీసుకొని హాస్టల్ వసతి కల్పించారు. విద్యార్థులు మధ్యాహ్నం కళాశాల వద్ద ఉన్న క్యాంటిన్‌లో భోజనం, రాత్రికి హాస్టల్ వద్దకు భోజనం పంపిస్తున్నారు.
కళాశాలలో అన్ని వసతులు ఉంటే విద్యార్థులకు మంచి బోధన అందించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ విద్యార్థులకు మంచి బోధన అందిస్తున్నాం.
– వేణుగోపాల్,
జేఎన్‌టీయూ కళాశాల ప్రిన్సిపాల్


