రోగాలకు ఓపెన్‌ ప్లాట్లు | - | Sakshi
Sakshi News home page

రోగాలకు ఓపెన్‌ ప్లాట్లు

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

నోటీసులిచ్చాం

సిరిసిల్లటౌన్‌: ఇది వర్షాకాలం.. రోగాలు విస్తరించే సమయం.. దోమలు స్వైరవిహారం చేస్తున్న తరుణం.. పట్టణంలోని నివాసగృహాల మధ్య ఉన్న ఖాళీ స్థలాలు రోగాలకు నిలయంగా మారాయి. చెత్తా చెదారం, పొదలు, పిచ్చిమొక్కలకు తోడు వర్షపునీళ్లు, డ్రైనేజీ నీరు చేరి ఇళ్ల మధ్యలో మురికికూపాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా దోమలు, పందులకు నిలయాలుగా మారుతున్నాయి. పారిశుధ్యంలో నూరుశాతం స్వచ్ఛత సాధించిన పట్టణంలో ఓపెన్‌ ప్లాట్లపై బల్దియా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఓపెన్‌గా నిర్లక్ష్యం

జిల్లా కేంద్రం సిరిసిల్లలో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, విలీన గ్రామాల్లో చాలా ప్రాంతాల్లో నిర్మాణాలు లేక స్థలాలు ఖాళీగా ఉంటున్నాయి. ఆయా ప్లాట్లలో నిలుస్తున్న నీటితో పిచ్చిమొక్కలు మొలిచి మురికి కూపాలుగా మారాయి. నీటి నిల్వ ప్రాంతాల్లో కనీసం బ్లీచింగ్‌పౌడర్‌ కూడా చల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఖాళీస్థలాల్లో విషపురుగులు చేరుతుండటంతో సమీప ప్రాంత వాసులు భయాందోళనలు చెందుతున్నారు. ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అటు స్థలాల యజమానులు, ఇటు మున్సిపల్‌ అధికారులు పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దోమల స్వైరవిహారం

ఖాళీ స్థలాల్లో నిలిచిన మురుగునీరు, పెరిగిన చెత్తాచెదారంతో పట్టణంలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వర్షాకాలం కావడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బీవైనగర్‌, తారకరామానగర్‌, గణేశ్‌నగర్‌, సాయినగర్‌, ఇందిరానగర్‌, సుందరయ్యనగర్‌, పద్మనగర్‌, సుభాష్‌నగర్‌, నెహ్రూనగర్‌, గోపాల్‌నగర్‌, వెంకంపేట, సర్దారనగర్‌, ప్రగతినగర్‌తో పాటు కొత్తగా వెలుస్తున్న కాలనీలు, విలీన గ్రామాల్లోని పెద్దూరు, సర్దాపూర్‌, రాజీవ్‌నగర్‌, పెద్దబోనాల, చిన్నబోనాల, రగుడు, చంద్రంపేటలో జనావాస ప్రాంతాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్‌ చేయడంతో పాటు డ్రైనేజీల్లో దోమల లార్వాలు పెరుగకుండా ఆయిల్‌బాల్స్‌ వేయాలని పట్టణవాసులు కోరుతున్నారు.

నివాసాల మధ్య మురికికూపాలు

ఖాళీ స్థలాల్లో నిలుస్తున్న వర్షపు నీరు

చెత్తాచెదారం, నీటితో దోమలు వృద్ధి

రోగాల బారిన ప్రజలు

పట్టింపులేని అధికారులు

పట్టణంలోని అన్ని వార్డుల్లో ఖాళీ స్థలాలను గుర్తించాం. చాలా మందికి నోటీసులు అందించాం. ప్రజాపాలనలో భాగంగా మురికినీరు, చెత్తాచెదారంతో నిండిన వందకు పైగా ప్లాట్లను జేసీబీతో శుభ్రం చేయించాం. ప్లాట్ల యజమానులు బాధ్యతతో మెదలాలి. వర్షం నీరు నిల్వకుండా, చెట్ల పొదలు పెరుగకుండా చూడాలి.

– ఎంఏ. ఖాదీర్‌పాషా, మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement