సిరిసిల్లటౌన్: జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో మంగళవారం చిరుజల్లులు కురిశాయి. రుద్రంగి 6.0మి.మీ., చందుర్తి 1.8మి.మీ., వేములవాడ రూరల్ 3.3మి.మీ., బోయిన్‌పల్లి 9.4మి.మీ., వేములవాడ 5.5మి.మీ., సిరిసిల్ల 3.9మి.మీ., కోనరావుపేట 7.9, వీర్నపల్లి 11.3, ఎల్లారెడ్డిపేట 1.3మి.మీ., గంభీరావుపేట 0.9మి.మీ., ముస్తాబాద్ 8.7మి.మీ., తంగళ్లపల్లి 3.8మి.మీ., ఇల్లంతకుంట 0.3మి.మీ చొప్పున వర్షం పడింది.
ప్రారంభమైన ఆయిల్ పాం దిగుబడి
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో ఆయిల్ పాం పంట దిగుబడి ప్రారంభమైందని జిల్లా ఉద్యాన అధికారి శరత్‌బాబు అన్నారు. మండల రైతులు పండించిన 63 టన్నుల ఆయిల్ పాం గెలలను మార్కెట్ యార్డు నుంచి ప్రీ యునిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నర్మెట్ట ఆయిల్ పాం ఫ్యాక్టరీకి మంగళవారం తరలించారు. జిల్లాలో 2,850 ఎకరా ల్లో రైతులు ఆయిల్‌పాం పంట సాగు చేస్తున్నారని, టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.23,488 ఉందన్నారు. ఏఎంసీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్, ఎంఏవో ప్రణీత, ఆయిల్ పాం కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్ పాల్గొన్నారు.
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
వేములవాడ: వేములవాడలోని శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంగళవారం ప్ర భుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని మొ క్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూం మధు, నాయకురాలు పాత సత్యలక్ష్మి, మాజీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు వీర్నపల్లికి కేటీఆర్
వీర్నపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే తారక రామారావు(కేటీఆర్) బుధవారం వీర్నపల్లి మండలంలో పర్యటిస్తున్నట్లు బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి తెలిపారు. కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా వీర్నపల్లిలో నిర్వహించనున్న ఉచిత కళ్లద్దాల పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని అన్నారు.
వెంకటేశంను హత్య చేసిన వారిని శిక్షించాలి
సిరిసిల్లటౌన్: నేత కార్మికుడు వెంగల వెంకటేశంను హత్య చేసిన వారిని శిక్షించాలని బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. మంగళవారం సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో బీఆర్‌ఎస్ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. వెంగళ వెంకటేశంను హత్య చేసి అది ఆత్మహత్యగా సృష్టించి ఆ నెపాన్ని బీఆర్‌ఎస్ నేతపై మోపాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లిఫ్ట్‌లో ఇరుక్కున్న అడ్వకేట్లు
సిరిసిల్లటౌన్: విధులకు హాజరయ్యేందుకు కోర్టుకు వచ్చిన ఇద్దరు అడ్వకేట్లు అన్సార్ అలీ, మల్లేశం మంగళవారం మూడో అంతస్తులోకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కగా మధ్యలోనే కరెంట్ పోయి ఇరుక్కున్నారు. సుమారు 15 నిమిషాలు అందులోనే ఉండిపోయినట్లు న్యాయవాదులు తెలిపారు. కోర్టు సిబ్బంది విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించి కరెంట్ సరఫరా చేయగా లిఫ్ట్ నుంచి బయట పడినట్లు తెలిపారు.


