కలెక్టర్ గరీమ అగ్రవాల్
సిరిసిల్లటౌన్: జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ మహేశ్ బీ.గీతేతో కలిసి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జెండా ఆవిష్కరణకు వేదిక, గ్రౌండ్ తదితర ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణ, ఉత్తమ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసే ప్రతిపాదనలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్‌వో జయశ్రీ, సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


