ప్యాకింగ్ మెషీన్
ప్యాకింగ్ కవర్లు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్న చందంగా ఉంది ఆన్‌లైన్ మోసగాళ్ల పరిస్థితి. కోవిడ్ కాలంలో ‘దీపాల వత్తులు చేసిస్తే నెలనెలా డబ్బులిస్తాం.. కుంకుడుకాయలు దంచిస్తే.. పైసలిస్తాం..’ అంటూ ఆన్‌లైన్ ద్వారా మోసాలు చేసిన ఘనులు తిరిగి విజృంభిస్తున్నారు. అమాయక గృహిణులే లక్ష్యంగా తిరిగి తమ మోసాలు కొనసాగిస్తున్నారు. పాత్రలు తోముకునే స్క్రబ్బర్ల పేరిట ఉమ్మడి జిల్లాలో జరిగిన భారీ స్కాం వెలుగుచూసింది. మూడు నెలలపాటు సాఫీగా సాగిన ఈ కుంభకోణం ఇటీవల బోర్డు తిప్పడంతో లోకమంతా తెలిసింది. తొలుత ఆన్‌లైన్‌లో మొదలైన ఈ స్కాం.. క్రమక్రమంగా మల్టీ చైన్ మార్కెటింగ్‌గా రూపాంతరం చెందింది.
అసలేం జరిగింది?
జగిత్యాలకు చెందిన ఓ మహిళ.. ఇన్‌స్ట్రాగాంలో పార్ట్‌టైం జాబులు, ఎంఎక్స్‌వో కంపెనీ పేరిట వర్క్ ఫ్రం హోం అంటూ ప్రకటన చూసింది. విజయవాడలోని కొందరు నిర్వాహకులు తాము స్క్రబ్బర్లకు సంబంధించిన ప్యాకింగ్ చేయిస్తామని, మెటీరియల్ ఇస్తామని, ఇంటి వద్ద ఉండి పనిచేసుకుంటే నెలకు రూ.24వేలు ఇస్తామని చెప్పారు. ప్యాకింగ్ మెటీరియల్ కోసం రూ.1.50 లక్షలు చెల్లించింది. తనకు నెలనెలా ఠంఛనుగా రూ.24వేలు రావడంతో కరీంనగర్, గోదావరిఖనిలతో ఉండే తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో వారూ చేరారు. ఇలా వందలాది మంది స్కీంలో చేరారు. ఈ స్కీములో చేరిన వారికి ఒక ప్యాకింగ్ మెషీన్, కొన్ని స్క్రబ్బర్ల షీట్లు, ప్యాకింగ్ కవర్లు ఇచ్చారు. వీటిని ప్యాకింగ్ చేసిన తరువాత స్థానికంగా సదరు కంపెనీ నియమించుకున్న డిస్ట్రిబ్యూటర్లు వచ్చి సామగ్రిని కలెక్ట్‌చేసి తీసుకెళ్లేవారు. ఈ క్రమంలో పెద్దపల్లి నుంచి 30 మంది, కరీంనగర్ నుంచి 57 మంది, జగిత్యాలలో 52 మంది మహిళలు ఈ స్కీములో చేరారు.
బోర్డు తిప్పేయడంతో లబోదిబో
ఏప్రిల్ నుంచి జూన్ వరకు బాగానే తన కస్టమర్లకు నెలనెలా డబ్బులు పంపిన సంస్థ అకస్మాత్తుగా జూలై నుంచి చెల్లింపులు నిలిపివేసింది. రేపు మాపూ అంటూ వాయిదాలు వేస్తూ వచ్చారు. ఈ వారంలో విజయవాడకు చెందిన ఎంఎక్స్‌వో కంపెనీ ప్రతినిధులందరి ఫోన్లు మూగబోవడంతో మోసపోయామని గ్రహించారు. కొందరు విజయవాడకు వెళ్లి కంపెనీ ప్రతినిధులను కలిసే ప్రయత్నం చేసినా అవేమీ సఫలం కాలేదు. దీంతో మెటీరియల్ కొనుగోలు చేసిన వారంతా డిస్ట్రిబ్యూటర్ల వెంట పడుతుంటే.. వారంతా ముఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్నారు. మోసపోయిన వారిలో చాలామంది గత నెలలో మెటీరియల్ కొన్న వారు కూడా ఉండటం గమనార్హం. తమకు కనీసం ఒక నెల చెల్లింపులు కూడా దక్కలేదని వాపోతున్నారు.
గృహిణులే లక్ష్యంగా పార్ట్‌టైం జాబ్‌లంటూ ఆన్‌లైన్‌లో ఎర
స్క్రబ్బర్లు ప్యాక్ చేసిస్తే నెలకు రూ.24 వేల చొప్పున జమ
మూడు నెలల తరువాత బోర్డు తిప్పేసిన ‘ఎంఎక్స్‌వో’ సంస్థ
మెటీరియల్ కోసం రూ.1.50 లక్షల వరకు వసూలు
జగిత్యాలలో మొదలై ఉమ్మడి జిల్లాకు పాకిన కుంభకోణం
కస్టమర్లకు ముఖం చాటేసి తిరుగుతున్న డిస్ట్రిబ్యూటర్లు


