● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట(వేములవాడ): మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలం గొల్లపల్లి(వట్టిమల్ల)లో మహిళా సమాఖ్య భవనాన్ని సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ఇల్లు లేని ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామన్నారు. కోనరావుపేట మండలంలో త్వరలో వంతెనల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. పెంటివాగు, మూలవాగుపై వంతెనల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. గొల్లపల్లికి వాటర్‌ప్లాంట్ మంజూరు చేస్తామన్నారు. కల్యాణ మండపం నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు వట్టిమల్లలోనీ మూలవాగును, ఇటీవల కురిసిన వర్షాలకు తెగిపోయిన రహదారిని పరిశీలించారు. అనంతరం నిమ్మపల్లి ప్రాజెక్టు వద్ద గంగమ్మతల్లికి పూజలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మానుక సత్యం, సింగిల్‌విండో చైర్మన్ బండ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య ఉన్నారు.


