● జిల్లాలో 87.62 శాతం డిజిటలైజేషన్ ● ముగిసిన ఎస్‌ఐఆర్ గడువు ● జిల్లా ఓటర్లు 4,75,694 ● ఆఖరి రోజు పనిచేయని ఆన్‌లైన్
సిరిసిల్ల: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ప్రత్యేక సమగ్ర సవరణ) గడువు ముగిసింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేసి 2002 ఓటర్ల జాబితాతో పోల్చుతూ సవరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ సోమవారం రాత్రి వరకు 87.62 శాతం పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా 4,75,694 మంది ఓటర్లు ఉండగా.. బూత్ లెవర్ ఆఫీసర్ల(బీఎల్వో) ద్వారా ఇప్పటి వరకు 4,16,786 డిజిటలైజేషన్ పూర్తయింది. ఆగస్ట్ 17న ఓటర్ ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.
దోషాలు, లోపాలున్న వారికి నోటీసులు
అక్షర దోషాలు, ఓటర్ల జాబితాలో పేర్లు తప్పుగా నమోదు కావడం, లోపాలున్న పేర్లను ‘అనామలిస్’ జాబితాలో చేర్చారు. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటుహక్కు కలిగి ఉండడం, మరణించిన వారి పేర్లు కొనసాగడం వంటి సమస్య పరిష్కారానికి ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేయనున్నారు. జిల్లాలో లోపాలున్న ఓటర్లు 58,908 మందిని గుర్తించారు. వీరిని ‘అనామలిస్’ జాబితాలో ఉంచి ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ పూర్తి చేశారు. బూత్ లెవల్ ఆఫీసర్లు ఆన్‌లైన్‌లో పొరపాట్లను నమోదు చేసినా.. ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసే అవకాశం ఉంది. రెండు చోట్ల ఓటుహక్కు ఉన్న వారు సొంతూరిలోనే ఓటు వేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఈమేరకు 2002 ఓటర్ల జాబితాను పరిశీలించడంతో సొంతూరిలోని ఓట్లు బయటకు వస్తున్నాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారు పిల్లల చదువుల కోసం పట్టణాలకు వెళ్లిన వారు సైతం మళ్లీ స్వగ్రామాల్లో ఓటు ఉంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో ఓటర్ల జాబితాలో ఎన్యూమరేషన్ తర్వాత ఓటర్ల జాబితా తగ్గనుంది. రెండు ఓట్లు ఉన్న వారికి నోటీసులు జారీ చేసి జాబితాను సవరించనున్నారు.
రాజకీయ పార్టీలతో అధికారుల సమావేశాలు
జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గరీమా అగ్రవాల్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వేర్వేరుగా రాజకీయ పార్టీల నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌పై అనుమానాలను నివృత్తి చేశారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ బూత్‌లెవల్ అధికారులు ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, డిజిటలైజేషన్‌ను పరిశీలించారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ తుది దశకు చేరింది. సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబరు 15లోగా పరిష్కరించి అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు.
ఆఖరి రోజు పనిచేయని ఆన్‌లైన్
ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌కు చివరి రోజు ఆన్‌లైన్ సర్వర్ పని చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బంది పడ్డారు. జిల్లాలో పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ఎంత వరకు పూర్తయింది అనే అంశాన్ని పరిశీలించే అవకాశం లేకుండా పోయింది. జిల్లా స్థాయిలో కలెక్టరేట్‌లో పనిచేసే ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ సైతం ఫోన్ ఎత్తకుండా.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ‘సెలవు’లో ఉన్నారు. తుది రిజల్ట్ ఇచ్చేందుకు అధికారికంగా ఎవరూ అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఎస్‌ఐఆర్ స్వరూపం ఇలా..
ఓటర్లు : 4,75,694
బూత్ లెవల్ ఆఫీసర్లు : 549
బీఎల్వోకు కేటాయించిన ఓటర్లు : 866
ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ : 4,75,694
అందని ఎన్యూమరేషన్ పత్రాలు : 59,076
పూర్తయిన డిజిటలైజేషన్ : 4,16,786
డిజిటలైజేషన్ శాతం : 87.62
మృతులు : 12,795
శాశ్వతంగా వెళ్లిపోయిన వారు : 25,889
డబుల్ నమోదులు : 10,666
అడ్రస్ లేని వారు : 9,449


