డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
సిరిసిల్ల అర్బన్: రాష్ట్రంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల నమోదులో పొరపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఉందని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కే–కన్వెన్షన్ హాల్‌లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈనెల 20 నుంచి 30 వరకు జిల్లా కార్యవర్గంతోపాటు పట్టణంలోని అన్ని వార్డులు, మండల, గ్రామస్థాయి అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం సిరిసిల్ల, వేములవాడ టౌన్ నూతన అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు తదితరులు పాల్గొన్నారు.
ఒకే విద్యావిధానం అమలు చేయాలి
సిరిసిల్ల అర్బన్: దేశవ్యాప్తంగా ఎస్సెస్సీ, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అనే తేడాలు లేకుండా ఒకే విద్యావిధానం అమలు చేయాలని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మూడు రకాల విద్యావ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఎస్సెస్సీ సిలబస్‌లో చదువుకున్న విద్యార్థులు పెద్ద పోస్టుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతారని ప్రశ్నించారు. నేడు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే సన్సాద్ మార్చుకు భారీగా తరలిరావాలని కోరారు. అరుకాల రమేశ్, శ్రీహరి, విద్యాసాగర్, గాంధీబాబు, నరేందర్, శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు.
మోదీ విధానాలపై యువతరం పోరాడాలి
కోనరావుపేట(వేములవాడ): 2014లో అధికారంలోకి వచ్చేముందు ఏట రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువతరం జీవితాలతో మోదీ ప్రభుత్వం చెలగాటమాడుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మోసపూరిత విధానాలపై యువతరం పోరాడాలని కోరారు. మండలం ధర్మారంలో ఆదివారం సీపీఎం మూడు రోజుల రాజకీయ శిక్షణ తరగతుల ముగింపుసభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. బీజేపీ.. ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను అమలు చేస్తూ అదాని, అంబానీ లాంటి వాళ్లకు దేశ సంపదను కట్టబెడుతున్నారని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీకి కారణమైన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చేయాలని సోన్ వాంగ్‌చుక్ 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. సోన్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేయడాన్ని ఖండిస్తూ ఈనెల 20న దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ిసీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్, జిల్లా కార్యవర్గ సభ్యులు జవ్వాజి విమల, ఎగమంటి ఎల్లారెడ్డి, ఎర్రవెల్లి నాగరాజు, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు గురిజాల శ్రీధర్, గణేశ్, మల్లారపు ప్రశాంత్, ఎలిగేటి రాజశేఖర్, గీస భిక్షపతి పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిజామాబాద్‌లో ఎల్‌నినో ప్రభావం వ్యవసాయరంగంపై చూపే దుష్ప్రభావాలపై రైతులకు ఆదివారం అవగాహన కల్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీజేఆర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పలు సూచనలు చేశారు. సర్పంచ్ సింగం శ్రీహరి, కార్యదర్శి తిరుపతి, ఏఎంసీ వైస్ చైర్మన్ తాళ్లపెల్లి ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.


