మార్కాపురం: వూర్కాపురం జిల్లా తొలి ఎస్పీగా పంకజ్ కుమార్ మీనాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం పోలవరం జిల్లా ఓఎస్డీగా పని చేస్తున్నారు. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన ఈయన రాజస్థాన్‌లోని కోటాకు చెందిన వారు. ఈయన బాంబేలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదివి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 719 వ ర్యాంక్ సాధించారు. ప్రభుత్వం ఇప్పటికే మార్కాపురం ఓఎస్డీగా ఐపీఎస్ అధికారి నవజ్యోతి మిశ్రా ను నియమించింది.
ఒంగోలు వన్‌టౌన్: డప్పు కళాకారులకు పెన్షన్‌ల దరఖాస్తులకు మరో 20 రోజుల గడువు పొడిగించాలని మాదిగ సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దిపోగు కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒంగోలు అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారులకు, చర్మ కళాకారులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.4 వేల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలన్నారు. ఇల్లు లేని కళాకారులకు పక్కా గృహం నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేయాలన్నారు. పంచాయతీకి ఒక డప్పు కళాకారుడికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కళాకారులకు ష్యూరిటీ లేకుండా రూ.2 లక్షల రుణాలను ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. డప్పు కళాకారులు, చర్మకారుల రాష్ట్ర సదస్సు అక్టోబర్‌లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఒంగోలు టౌన్: ఈ నెల 25వ తేదీ ఒంగోలులోని బృందావన్ కళ్యాణ మండపంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్‌ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యుల మహాసభ నిర్వహించనున్నట్లు జేఏసీ రాష్ట్ర గౌరవ సలహాదారు లంకదాసరి ప్రసాదరావు తెలిపారు. నగరంలోని ఎంసీఏ భవనంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాబులో ఉంటుంది గ్రామీణ వైద్యులేనని తెలిపారు. మారుమూల ప్రజలకు సైతం వైద్య సేవలందిస్తుంది గ్రామీణ వైద్యులేనని చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం నుంచి తమకు గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జేఏసీ రాష్ట్ర నాయకుడు యామర్తి నాగేశ్వరరావు యూనియన్ నాయకులు ఎం.కృష్ణారెడ్డి, శ్యామ్, సుబ్బయ్య, నాయబ్ రసూల్, శ్రీనివాసరావు, వెంకటరావు పాల్గొన్నారు.


