వెన్నుపోటుదారులెవరో ప్రజలే తేలుస్తారు.. | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుదారులెవరో ప్రజలే తేలుస్తారు..

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

ఆర్‌ఆర్‌ ప్యాకేజీ ఇప్పించరా...

మార్కాపురం టౌన్‌: 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేశామని, కానీ, 2024 ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను రెండున్నరేళ్ల పాలనలో ఎంతవరకూ అమలుచేశారో ప్రజల ముందు పెడదామని, వెన్నుపోటుదారులెవరో ప్రజలే తేలుస్తారని వైఎస్సార్‌ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ఈ నెల 20న స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రెస్‌మీట్లో చేసిన వ్యాఖ్యలపై సోమవారం సాయంత్రం అన్నా రాంబాబు వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టును తామే పూర్తిచేశామంటూ కూటమి పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, 30 ఏళ్ల కల నెరవేర్చామంటూ పదే పదే చెబుతున్నారని, మరి ఈ 30 ఏళ్లలో 15 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్న సంగతి మరిచారా అని ప్రశ్నించారు. 2014 – 2019 మధ్య టీడీపీ అధికారంలో ఉందని, మరి ఆ ఐదేళ్లలో వెలిగొండ ప్రాజెక్టును ఎందుకు పూర్తిచేయలేదని అన్నా రాంబాబు ప్రశ్నించారు. 2004లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, 2019లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసన్నారు. మార్కాపురం జిల్లా తెచ్చామని గొప్పలు చెప్పే నాయకుడు రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ దొనకొండను రాజధానిగా చేస్తే బాగుంటుందని చెప్పిన విషయాన్ని మరిచారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిందని, దొనకొండను ఎందుకు రాజధాని చేయలేదని ప్రశ్నించారు. వెలిగొండ మేమే తెచ్చాం.. మార్కాపురం జిల్లా మేమే ఇచ్చాం అనడం సరికాదన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంటు ప్రాతిపదికన కొత్త జిల్లాలు ఇచ్చారని, మీరు అధికారంలో ఉన్నన్నాళ్లూ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. తమ పార్టీ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కందులను హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం అయ్యేందుకు సమావేశం పెట్టుకుని తాను మాట్లాడిన విషయాల్లో కొన్ని వ్యాఖ్యలను తనకు అనుకూలంగా కందుల ప్రస్తావించడం తగదన్నారు. తాను అన్న మాటలకు టీడీపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థంకావడం లేదన్నారు. వెన్నుపోటుదారులను ఉద్దేశించి తాను అన్న మాటలను మరొక విధంగా ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. కూటమిలో నాయకులకు మీరు సాయం చేస్తే చాలని, మా విషయాలను పట్టించుకోవద్దని, మీ గురించి మీ పార్టీ నాయకులు ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోవాలని కందులకు హితవు పలికారు. కరుడుగట్టిన వైఎస్సార్‌ సీపీ నాయకులు, జగనన్న సైన్యం, ప్రాణంపోయినా పార్టీ మారరనే విషయాన్ని కందుల గుర్తించుకోవాలన్నారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. మా కార్యకర్తలను మీ పార్టీలోకి ఆహ్వానించాల్సిన పనిలేదన్నారు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. మీ పార్టీని మీ కార్యకర్తలను మీరు సక్రమంగా చూసుకుంటే చాలన్నారు. వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని సూచించారు. అంతిమంగా ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

మార్కాపురం మండలంలోని గొట్టిపడియకు చెందిన వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో కొందరికే ప్యాకేజీ అందిందని, మిగతా వారికి ప్యాకేజీ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నా రాంబాబు తెలిపారు. నిర్వాసితుల పట్ల మీకు ప్రేమ ఉంటే ప్రభుత్వంతో చర్చించి వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. వారి త్యాగాలను గుర్తుంచుకుని సమన్యాయం చేయాలన్నారు. చెరువులను పూడ్చుతూ.. అక్రమాలకు పాల్పడుతున్నా పట్టించుకునేవారు లేరన్నారు. జనావాసాలకు దూరంగా కలెక్టరేట్‌ కడితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. మూడు నెలల క్రితం ఓ ప్రైవేటు వెంచర్‌ విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కోరితే ఇంతవరకూ అతీగతీ లేదన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు తాను వ్యతిరేకం కాదన్నారు. ఇవన్నీ ప్రజల కోసమే తాను మాట్లాడుతున్నానని, రాజకీయ లబ్ధి కోసం కాదని అన్నారు. తాను ఎవరికీ సరెండర్‌ కానని, ఏ విషయంలో కూడా లాలూచీ పడనని, తన వ్యక్తిత్వమేమిటో ప్రజలందరికీ తెలుసని అన్నారు. భవిష్యత్తు ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నానని, తన కాలేజీలో కొంత స్థలం ప్రజలకు ఉపయోగపడుతుందని భావించి ప్రభుత్వం కోరితే ఇచ్చేందుకు కూడా వెనకాడనని అన్నా రాంబాబు స్పష్టం చేశారు.

టీడీపీ పాలనలో ఎలా మోసం చేశారో

ప్రజలకు తెలుసు

వెలిగొండ ప్రాజెక్టు, మార్కాపురం జిల్లా ఏర్పాటు కూటమి ప్రభుత్వ క్రెడిట్‌ కాదు

మార్కాపురం ఎమ్మెల్యే కందుల వ్యాఖ్యలపై వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement