బేస్తవారిపేట: విద్యుదాఘాతానికి రైతు మృతిచెందిన సంఘటన బేస్తవారిపేట మండలంలోని ఆర్.కొత్తపల్లె సమీపంలోని పొలంలో సోమవారం జరిగింది. నేకునాంబాద్‌కు చెందిన తిప్పిశెట్టి రాధామోహన్ (49) తన పొలంలో సాగుచేస్తున్న మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. పొలం చుట్టూ ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచైపె హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడింది. ఈ విషయాన్ని గమనించక రాధామోహన్ గేటు తీసుకుని లోపలికి వెళ్లాడు. పొలంలో పనిచేసుకునే సమయంలో ధరించే చొక్కా ఇనుప కంచైపె ఉండటంతో దానిని తీసుకుంటూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. చెయ్యిపూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు రాధామోహన్ కుటుంబ సభ్యులకు, విద్యుత్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య సుజాత, ఇంటర్, డిగ్రీ చదువుకునే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై ఎస్‌వీ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కుటుంబానికి ఆధారమైన రాధామోహన్ మరణంతో భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు.
● కందుకూరులో మున్సిపల్ ఎన్నికల కోసం అధికార పార్టీ అరాచకాలు
కందుకూరు: నిబంధనలకు విరుద్ధంగా మున్సిపాలిటీలో గ్రామాలను విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేసిన మాజీ కౌన్సిలర్ దాసరి మాల్యాద్రిపై అధికార పార్టీ వేధింపులు తారాస్థాయికి చేశారు. హైకోర్టులో పిటీషన్ వెనక్కి తీసుకోవాలని కొంతకాలంగా మాల్యాద్రిపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు మాల్యాద్రి ససేమిరా అంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులను అడ్డంపెట్టుకుని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా మాల్యాద్రి, అతని కుమారుడు బాలాజీపై అక్రమ కేసులు నమోదు చేయించారు. స్వతహాగా దాసరి మాల్యాద్రి వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. మాల్యాద్రికి, టీడీపీ దళిత నాయకుడు చనమాల శ్రీధర్‌కు మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులు నమోదు చేశారు. పట్టణంలోని పోలేరమ్మగుడి ప్రాంతంలో తనని అడ్డుకుని కులంపేరుతో దూషించి బెదిరించినట్లు శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్ 308, 351, 115 సెక్షన్ల కింద సోమవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు పాటించమని కోర్టును ఆశ్రయిస్తే.. ఇలా అక్రమ కేసులతో వేధించడం సరైన విధానం కాదని, గ్రామాలు లేకపోతే మున్సిపాలిటీ గెలవలేమనే ఉద్దేశంతోనే అధికార పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒంగోలు సబర్బన్: ప్రముఖ రచయిత, కవి గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పి.రాజాబాబు, జేసీ, అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు.


