కూటమి పాపం.. రైతుకు శాపం..! | - | Sakshi
Sakshi News home page

కూటమి పాపం.. రైతుకు శాపం..!

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

మేదరమెట్ల:

చంద్రబాబు పాలన అంటేనే కరువు ఖాయమని రైతుల్లో నానుడి. అది నిజమేనని ప్రస్తుతం మరోసారి రుజువైంది. వర్షాలు లేవు. పంటలు లేవు. దీన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారులు నిత్యావసర సరుకుల ధరలను రోజురోజుకూ పెంచుకుంటూపోతున్నారు. వారిపై నియంత్రణ లేదు. రైతులు, కూలీలకు పనులు కరువయ్యాయి. దీంతో సగటు మనిషికి ఆదాయం లేకపోగా, సరుకుల ధరలు రోజురోజుకు ఎగబాతుంటే కనీసం మూడు పూటలా పిడికెడు మెతుకులు కూడా తినే పరిస్థితి లేకుండా పోతోంది. మూగ జీవాలకు సైతం గ్రాసం లేదు. ప్రభుత్వ పరంగా సైలేజ్‌ గడ్గి (పాతర గడ్డి) సరఫరా కూడా లేదు. చేలల్లో తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. దీనికంతటికి చంద్రబాబు ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే కారణమని రైతులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో రీ సర్వే తప్పుల తడకగా జరిగింది. వాటిని సరిచేయాలంటే భారీగా మామూళ్లు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామాల్లో పచ్చ నేతల తీరుతో భూ యజమానులు నష్టపోతున్నారు. క్షామం వెంటాడుతూ పంటలు ఎండిపోతుంటే పట్టించుకున్న వారు లేకపోగా, మామూళ్ల పేరుతో సంబంధిత అధికారులు, పచ్చ నేతలకు మాత్రం కాసుల పంట పండుతోందని బాధితులు మండిపడుతున్నారు. రీ సర్వే ప్రక్రియలో జాయింట్‌ ఎల్‌పీ (ల్యాండ్‌ పార్శిల్‌) పేరుతో ఆటంకాలు సృష్టించడంతో ఆయా భూములకు రిజిస్ట్రేషన్లు ఆగాయి. బ్యాంకు రుణాలు మంజూరు కావడం లేదు. గతేడాది పంట నష్టపరిహారమైనా వస్తే కొంత ఆదరువుగా ఉంటుందంటే.. అదీ లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మంచి జరిగితే తన ప్రతిభ.. చెడు జరిగితే అధికారుల తప్పు అంటున్న సీఎం...

మంచి జరిగితే తన ప్రతిభ అని చెప్పుకోవడం.. తప్పు జరిగితే ప్రతిపక్షాలు, అధికారులపై నెట్టి వేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా అది ఆయన నైజం. ప్రస్తుతం భూముల రీ సర్వేకు సంబంధించి గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు అండ్‌ కో విషం చిమ్ముతూ అసత్య ప్రచారాలు చేస్తోంది. రీ సర్వే జరిగితే ఎవరికీ భవిష్యత్తులో భూములు మిగలవంటూ ఆనాడు దుష్ప్రచారం చేశారు. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ్‌.. అన్న చందంగా అబద్ధాలు వండి వార్చారు. ప్రజలను భయాందోళనకు గురి చేశారు. ఎన్నికల వేళ అమలు చేయలేని హామీల వర్షం కురిపించి అన్ని వర్గాల ప్రజల ఓట్లు దండుకున్నారు. గెలిచిన తర్వాత రెండున్నరేళ్లుగా హామీలు అమలు చేయకుండా మోసగించారు. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు వరుసగా ఏదోక విధంగా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రీ సర్వే ప్రక్రియను అడ్డం పెట్టుకుంటున్నారు. రీ సర్వేలో తేడాలుంటే సమాధానం చెప్పే వారు కరువయ్యారు. ఎకరాకు 5 సెంట్ల వరకు తగ్గినా ఒప్పుకోల్సిందేనంటూ రెవెన్యూ యంత్రాంగం చెప్తోంది. రీ సర్వేలో వివరాల నమోదు పలుచోట్ల తప్పులు తడకగా మారింది. అది ఉద్దేశపూర్వకమేనన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. వాటిని సరిచేసేందుకు రెవెన్యూ యంత్రాంగం పైసలు వసూలు చేస్తోంది. దీనికి పచ్చ నేతలు కొమ్ముకాస్తున్నారు. పచ్చ నోట్లు ఇస్తేనే పని జరుగుతుందని పచ్చనేతలే చెప్పడం గమనార్హం.

ఎకరాకు 5 సెంట్ల వరకూ తగ్గినా

అడగటానికి లేదట.!

రీ సర్వేలో ప్రాథమికంగా రైతుల భూములు కొలిచే సమయంలో ఆయా ప్రాంతాల రైతులకు చెప్పి డ్రోన్‌ సర్వే నిర్వహించాలి. చాలా చోట్ల అలా జరగడం లేదు. ఈ క్రమంలో రికార్డుల్లో భూ విస్తీర్ణానికి సంబంధించిన కొలతల్లో 5 సెంట్ల వరకు తగ్గినా రైతులు అంగీకరించాల్సిందేనని రెవెన్యూ యంత్రాంగం చెప్పడం ప్రారంభించింది. ఇక, మొత్తం విస్తీర్ణంలో అంత కన్నా ఎక్కువ తగ్గితే ఆ సర్వే నంబర్‌లోని వాళ్లంతా సమానంగా తగ్గించుకోవాలని పచ్చ నేతలు అధికారుల పక్షాన పెద్దన్న పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఉన్న విస్తీర్ణం ఎటుపోతోందని రైతులు ప్రశ్నిస్తున్నారు. నష్టపోయిన వారి గోడు వినేవారు కరువయ్యారు. రీ సర్వేలో జరిగిన పొరపాట్లు సరిచేయాలంటే కూడా కాసులు చెల్లించనిదే కాగితం కదిలే పరిస్థితి కనిపించడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగిన రిజిస్ట్రేషన్లు, మంజూరు కాని రుణాలు...

జాయింట్‌ ఎల్‌పీ (ఉమ్మడి ల్యాండ్‌ పార్సెల్‌) అంటే ఒక భూ విస్తీర్ణంలో ఒకరి కన్నా ఎక్కువ మంది ఉన్నప్పుడు రైతులకు అవగాహన కల్పించి ఎవరి వ్యక్తిగత ఎల్‌పీ నంబర్‌ వారికి ఇవ్వాలి. అయితే, చాలా చోట్ల జాయింట్‌ ఎల్‌పీ ఇచ్చారు. సదరు ఉమ్మడి ప్రాంతంలో రైతులు ఒక అవగాహనకు రాకపోవటంతో జాయింట్‌ ఎల్‌పీ కింద నమోదు చేశామని రెవెన్యూ యంత్రాంగం చెబుతోంది. అయితే.. జాయింట్‌ ఎల్‌పీలో ఉన్న విస్తీర్ణాలకు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. బ్యాంకుల్లో రుణాలు మంజూరు కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటి పరిష్కారం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

ప్రభుత్వం మాదే కావడంతో

నోరు మూసుకున్నామంటున్న పలువురు టీడీపీ నాయకులు...

రీ సర్వేలో తప్పులపై విపక్షాలు, సాధారణ ప్రజలతో పాటు టీడీపీకి చెందిన వారు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాట్లాడుతూ.. నాకు 20 సెంట్లు తగ్గింది.. ఎవరిని అడిగినా సమాధానం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాడు. పార్టీ మాది.. మా వాళ్లే తేడాగా ఉన్నారు.. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని నోరు మూసుకున్నానని చెప్పుకొచ్చారు. మరో గ్రామ టీడీపీ కార్యకర్త మాట్లాడుతూ.. నాకు రెండు సర్వే నెంబర్లలో 17 సెంట్లు పోయింది. అదేమంటే మేం మాట్లాడుతున్నాం కదా.. నాలుగు రోజులు ఓపిక పట్టండని మా నాయకులే చెబుతున్నారు. ఏం చేయలేక నోరుమూసుకుంటున్నామని వాపోయారు. ఇలాంటి వారు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు.

ఒకవైపు రీ సర్వే కష్టాలు..

మరోవైపు కరువుతో నష్టాలు

నాడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో

పారదర్శకంగా రీ సర్వే

నేడు అధికారులు, పచ్చ నేతల చేతివాటం

జాయింట్‌ ఎల్‌పీలతో ఆగిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు

బ్యాంకుల్లో మంజూరు కాని రుణాలు

నేటికీ అందని గతేడాది పంట

నష్టపరిహారం

చంద్రబాబు ప్రభుత్వానికి ముందు

చూపు లేకపోవడమే కరువుకు కారణం

ప్రకాశంను కరువు జిల్లాగా

ప్రకటించాలని రైతుల డిమాండ్‌

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా రీ సర్వే...

కేంద్ర ప్రభుత్వ భూ వనరుల శాఖకు చెందిన డిజిటల్‌ ఇండియా ల్యాండ్‌ రికార్డ్స్‌ మోడరనైజేషన్‌ ప్రోగ్రాం (డీఐఎల్‌ఆర్‌ఎంపీ) కింద రాష్ట్రాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. అందుకు సంబంధించి 2020వ సంవత్సరంలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జిల్లా మొత్తం భౌగోళిక విస్తీర్ణం 14.323 లక్షల హెక్టార్లు కాగా, 520 గ్రామాలు రీ సర్వే పరిధిలో ఉన్నాయి. సుమారు 60 శాతం రీ సర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రీ సర్వే పారదర్శకంగా జరిగింది. కానీ, నేడు కూటమి ప్రభుత్వంలో అంతా లోపభూయిష్టంగా మారింది. ఆనాటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను, నేటి చంద్రబాబు పాలనను బేరీజు వేసుకుని కూటమి పాలనపై రైతులు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement