పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడండి | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడండి

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంపై నిర్లక్ష్యం వీడండి

మార్కాపురం కలెక్టర్‌ విజయ సునీత ప్రజా సమస్యలపై 257 అర్జీల స్వీకరణ

మార్కాపురం టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అధికారులు ప్రత్యేక చొరవతో, అత్యంత వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ ఎం.విజయ సునీత ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిష్కరించదగిన సమస్యలను అధికారులు నేరుగా పరిశీలించి అర్జీదారుల సమక్షంలోనే పారదర్శకంగా పరిష్కరించాలని సూచించారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే కలెక్టరేట్‌ చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని అన్నారు. రీ–ఓపెన్‌ అర్జీలు రాకుండా చూడాల్సిన పూర్తి బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు సరిచూసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలన్నారు. స్వీకరించిన అర్జీల్లో ఎక్కువభాగం రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నందున, రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా స్పందించి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నారు. ప్రజల సంతృప్తే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో వివిధ సమస్యలపై మొత్తం 257 అర్జీలు రాగా, వాటిలో రెవెన్యూ సంబంధిత అర్జీలు 182, ఇతర శాఖల సంబంధిత అర్జీలు 75 వచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో జేసీ పి.శ్రీనివాసులు, డీఆర్‌ఓ వెంకట శివరామిరెడ్డి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సిబ్బంది కొరతతో అర్జీదారుల అవస్థలు...

సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు పెద్ద సంఖ్యలో అర్జీదారులు సోమవారం మార్కాపురం కలెక్టరేట్‌కు వచ్చారు. సిబ్బంది వద్ద అర్జీలు అందజేసి రసీదులు పొందిన తర్వాత కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు అర్జీలు అందజేస్తారు. అయితే, సోమవారం జరిగిన పీజిఆర్‌ఎస్‌లో అర్జీదారులకు రసీదులివ్వాల్సిన సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటంతో అర్జీదారులు గంటలకొద్దీ వేచి ఉండక తప్పలేదు. సుమారు 3 సోమవారాలు వివిధ కారణాలతో పీజీఆర్‌ఎస్‌ నిర్వహించకపోవడంతో అధిక సంఖ్యలో అర్జీదారులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. వీరితోపాటు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులు కూడా అధిక సంఖ్యలో రావడం, సిబ్బంది సరిపడా లేకపోవడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement