బెధరగొడుతున్నాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

బెధరగొడుతున్నాయ్‌..

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

భగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల ధరలు ఒక్క నెలలోనే రూ.400కు పైగా పెరిగిన బియ్యం ధరలు ఉల్లిపాయల ధరలు ౖపైపెకి..వంటనూనెలు సలసలా చేదెక్కిన పంచదార..బెల్లం నింగినంటిన కూరగాయల ధరలు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 100 శాతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు అర్ధాకలితో అలమటిస్తున్న నిరుపేద, మధ్య తరగతికి చెందిన సామాన్యులు

ఒంగోలు టౌన్‌/మార్కాపురం: నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఇప్పటికే పెరుగుతున్న కుటుంబ ఖర్చులతో సతమతమవుతున్న ప్రజలపై మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల మరింత భారంగా మారింది. ముఖ్యంగా బియ్యం, పప్పులు, నూనెల ధరలు కొద్ది రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ధరల పెరుగుదలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు తగిన స్థాయిలో పర్యవేక్షించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి కుటుంబానికి అత్యవసరమైన బియ్యం ధర ఒక్కసారిగా పెరిగింది. మార్కాపురం జిల్లాలో నాలుగు రోజుల క్రితం కర్నూలు సోనా రకం బియ్యం 25 కిలోల బస్తా రూ.1,800 ఉండగా ప్రస్తుతం రూ.2,100 కు చేరినట్లు వినియోగదారులు చెబుతున్నారు. ఒక రకం బియ్యం రూ.2 వేల నుంచి రూ.2200కు పెరిగింది. అంటే కేవలం నాలుగు రోజుల్లోనే బస్తాపై రూ.300 భారం పడింది. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని ఒక మాల్‌లో జులై మొదటి వారంలో కర్నూలు సోనా బియ్యం ధర 25 కిలోల బస్తా రూ.1130 ఉంది. జులై చివరకు వచ్చే సరికి రూ.1520 కు పెరిగి పోయింది. ఒక్క నెలలోనే రూ.400 పెరిగి పోయింది. బాపూజీ కాంప్లెక్స్‌లోని ఒక దుకాణంలో రూ.1350 బీపీటీ బియ్యం ధర ఇప్పుడు రూ.1600 నుంచి రూ.1720 వరకు పెరిగింది. ఒక్క నెలలోనే ధరలు పెరగడంతో నిరుపేద సామాన్యులు ఏం తినాలో, ఎలా బతకాలో అర్థం కాక సతమతమవుతున్నారు. సన్న అన్నానికి బదులుగా రాగి సంగటో, జొన్న అన్నమో తిందామన్నా వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పచ్చజొన్నలు కిలో రూ.80 కు విక్రయిస్తుండడంతో బాబోయ్‌ అని గుండెలు బాదుకుంటున్నారు. రాగులు సైతం కిలో రూ.50 కు అమ్ముతున్నారు. బియ్యంతో పాటు వంటింట్లో నిత్యం ఉపయోగించే పప్పుల ధరలు కూడా పెరుగుతున్నాయి.

ఉల్లిపాయ పేరు వింటేనే కన్నీళ్లు...

నెల రోజుల నుంచి ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒంగోలులో పచ్చి ఉల్లిపాయల ధర కిలో రూ.50 వరకు విక్రయిస్తున్నారు. పాత ఉల్లిపాయలు కిలో రూ.25 నుంచి ఏకంగా రూ.70 కు పెరిగాయి. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఉల్లిపాయ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. కిలో రూ.100 దాటినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. రేషన్‌ షాపుల ద్వారా తక్కువ ధరలకు ఉల్లిపాయలు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పి రోజులు గడుస్తున్నా అది కేవలం మాటలకే పరిమితమైంది. కనీసం టీ తాగుదామనుకున్నా పంచదార ధరలు పెరిగిపోవడంతో దానికి కూడా జేబులు వెదుక్కోవాల్సిన దుస్థితి నెలకొందని మధ్య తరగతి ప్రజలు విసుక్కుంటున్నారు. నిన్నా మొన్నటి వరకు టీస్టాల్స్‌లో ఒక్కో టీ రూ.10కు విక్రయించేవారు. అల్లం బెల్లం టీ రూ.15, కాఫీ రూ.25 ఉండేది. కిలో పంచదార రూ.45 ఉండగా..నెల రోజుల్లో పంచదార కిలో రూ.70కు చేరింది. బెల్లం ధర కూడా రూ.50 నుంచి రూ.65కు చేరింది. దీంతో సాధారణ టీ రూ.12 నుంచి రూ.15, అల్లం బెల్లం టీ రూ.18 నుంచి రూ.20, కాఫీ రూ.30కు విక్రయిస్తున్నారు. జిల్లా అంతటా దాదాపుగా ఇవే ధరలు ఉన్నాయి.

మంట పెడుతున్న వంట నూనెలు:

వంట నూనెల ధరలు సామాన్యుడిని భయపెడుతున్నాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో వేరుశనగ నూనె లీటర్‌ రూ.130 ఉండేది. ఇప్పుడది ఏకంగా రూ.185 కు చేరింది. వేరుశనగ గుండ్లు కిలో రూ.130 నుంచి రూ.160 విక్రయిస్తున్నారు. దాంతో త్వరలో లీటర్‌ వేరుశనగ నూనె రూ.200కు చేరడం ఖాయమని వ్యాపారులు చెబుతున్నారు. రూ.100 నుంచి రూ.110 కు విక్రయించిన పామాయిల్‌ నేడు ఏకంగా రూ.160కు చేరింది. సన్‌ ఫ్లవర్‌ నూనె ధరలు కూడా రూ.180పైగానే అమ్ముతున్నారు. వంట నూనెల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయడంలేదని, యుద్దం సాకు చెప్పి తప్పించుకుంటుందని మిల్లర్లు చెబుతున్నారు.

కేవలం బియ్యం, కంది పప్పు, పంచదార, వంటనూనెలే కాకుండా అన్నీ రకాల నిత్యావసర వస్తువుల ధరలు సుమారు 30 నుంచి 50 శాతం వరకు పెరిగినట్లు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అల్లం కిలో రూ.180, మినప గుండ్లు కిలో రూ.135, వెల్లుల్లి కిలో రూ.200, ఎండు మిర్చి కిలో రూ.250, ఎరుపు రంగు కొబ్బరి కిలో రూ.200, నలుపు రంగు కొబ్బరి కిలో రూ.400 కు చేరింది. కిలో రూ.140గా ఉన్న ధనియాల ధర రూ.225 అయ్యాయి.

ధరలు తగ్గించాలి

గతనెల రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బియ్యం ధర అయితే అడ్డూ అదుపులేకుండా పెరుగుతోంది. కందిపప్పు కూడా కొనలేం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ధరలను నియంత్రించాలి. ఉల్లిగడ్డలైతే ఏకంగా రూ.75కు చేరాయి.

– సుస్మిత భూషణ కుమారి, మార్కాపురం

నిత్యావసర సరుకుల ధరలపై నియంత్రణ ఏదీ

నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించాల్సిన యంత్రాంగం ఉన్నా మార్కెట్‌లో ధరల పెరుగుదల కొనసాగుతుండటంపై ఆందోళనగా ఉంది. అటు కూరగాయలు, ఇటు నిత్యావసర వస్తువులు రెండూ హద్దుల్లేకుండా పెరిగిపోతున్నాయి. రూ.100 జేబులో వేసుకుని కూరగాయల మార్కెట్‌కు వెళితే రోజుకు సరిపడా కూరగాయలు కూడా రావడం లేదు. జీవనం కష్టమవుతోంది. ఇలా అయితే రానున్న రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి కడుపునిండా తిండితినలేని పరిస్థితి వస్తుంది.

– ఇబ్రహీం, మార్కాపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement