మద్దిపాడు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యంతో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి సామాన్యులపై మోయలేని భారం పడుతోందని, ధరలు తగ్గించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. మద్దిపాడులోని వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం చేయాలంటేనే రైతులు భయపడిపోయే పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించారని ఆయన విమర్శించారు. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వంట నూనె, చింతపండు, ఉల్లిపాయలు సహా అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల భారంతో మధ్య తరగతి కుటుంబాలు విలవిల్లాడుతున్నాయన్నారు. చంద్రబాబు ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ ఎవరికిచ్చారు.. ఎంతమందికి ఇచ్చారో లెక్క చెప్పగలరా అని మేరుగు నాగార్జున ప్రశ్నించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రైతులు, విద్యార్థులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు ఫలాలు అందించారని గుర్తుచేశారు. ఆనాడు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని విమర్శించిన చంద్రబాబు.. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లుతెరిచి పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తల్లికి వందనం పథకం
లబ్ధిదారుల లెక్క చెప్పగలరా.?
ఆర్థిక కారణాలతో పేద పిల్లలు చదువుకు దూరం కాకూడదని జగనన్న అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టి అనేక విద్యా సంస్కరణలను జగనన్న అమలు చేశారని మేరుగు నాగార్జున ప్రస్తావించారు. చెప్పిన సమయానికి తల్లుల ఖాతాలో అమ్మ ఒడి పథకం డబ్బు జమ చేసి వారి పిల్లల చదువుకు చేయూతనిచ్చారన్నారు. కానీ, గత ఎన్నికలకు ముందు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమంది పిల్లలకూ రూ.15 వేల చొప్పున నగదు జమ చేస్తామని చెప్పిన చంద్రబాబు.. నేడు కొందరికి రూ.7 వేలు, మరికొందరికి రూ.5 వేల చొప్పున డబ్బులు వేసి చేతులు దులుపుకున్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమ్మ ఒడి ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు.. ప్రస్తుతం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమందికి లబ్ధి చేకూరిందో ప్రభుత్వం లెక్కలతో సహా చెప్పాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కరువు విలయతాండవం...
ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన గ్రామాలన్నీ ఇప్పుడు బీళ్లుగా మారిపోయాయని, రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. వ్యవసాయ రుణాలు రీ షెడ్యూల్ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించి అండగా నిలిచారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకిచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతులకు పెట్టుబడి సాయం ఎంతమందికిచ్చారో లెక్కలు తీస్తే అర్థమైపోతుందని, ఏ పంటకూ రైతుకు గిట్టుబాటు ధర లభించకపోతే ప్రభుత్వం స్పందించకుండా మీనమేషాలు లెక్కిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కరువు మండలాల పరిస్థితిపై వైఎస్సార్ సీపీ మొదటి నుంచి మాట్లాడుతోందని, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమస్యను ప్రస్తావించిన తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు మండలాలను ప్రకటించాలని, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకంతో సహా ఎన్నికల హామీలన్నీ పూర్తిస్థాయిలో అమలు చేయాలని మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో తాము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మద్దిపాడు మండల ఉపాధ్యక్షుడు వాకా కోటిరెడ్డి, నాయకులు పాలడుగు రాజీవ్, నాదెండ్ల మహేష్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం
ధరల నియంత్రణపై సీఎం దృష్టి సారించాలి
కరువు పరిస్థితులను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలి
లేకుంటే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగుతాం
వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున హెచ్చరిక


