ప్రజలను వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
కొండపి: స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. మంగళవారం మండలంలోని పోలిరెడ్డిపాలెం గ్రామంలో మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు అధ్యక్షతన మండల స్థాయి స్థానిక సంస్థల సంసిద్ధత, కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తానని, తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరూ చూస్తారన్నారు.
వెన్నుపోటు పొడిచిన కూటమి
రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని సురేష్ విమర్శించారు. ఇచ్చిన హామీలను 100 శాతం నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి చెందుతుందని కొనియాడారు. నియోజకవర్గంలో రెండు సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవని విమర్శించారు. పెన్షన్ల కోసం 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వాటిని చూసి కూటమి ప్రభుత్వానికి మతిపోయిందని.. అన్ని పెన్షన్లు ఇవ్వలేమని మంత్రి అచ్చం నాయుడు చెబుతున్నారని విమర్శించారు.
నియోజకవర్గాన్ని దోచుకుంటున్న కూటమి నేతలు
నియోజకవర్గంలో రేషన్, మట్టి, గ్రావెల్, ఇసుక మాఫియాతో కూటమి నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని సురేష్ విమర్శించారు. ఎవరి వాటా ఎంతో వారే నిర్ణయించుకొని దోచుకునే పనిలో మంత్రి స్వామి, సత్య పోటీ పడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో 90 వేల రేషన్ కార్డులు ఉండగా ఒక కార్డుకి 10 కేజీలు చొప్పున నెలలో రూ.2 కోట్లు అక్రమ రేషన్ మీద సంపాదిస్తున్నారని, నియోజకవర్గంలో 22 మద్యం దుకాణాలుండగా దాదాపు 400 బెల్ట్ షాపులున్నాయని, దాని ద్వారా రూ.లక్షల్లో సంపాదిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం షాపులను రెన్యువల్ చేసుకోమని అవకాశం ఇవ్వగా ఇప్పటికి 40 శాతం కూడా రెన్యువల్ చేసుకోలేదని.. దానికి కారణం బెల్టు దుకాణాలతో వచ్చే ఆదాయమేనని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినాయక విగ్రహం దగ్గర నుంచి నాయకుల ఇళ్ల స్థలాల ధ్వంసం, బొప్పాయి తోట ధ్వంసం, రచ్చబండల ధ్వంసంతో చెలరేగిపోతున్నారన్నారు. ఫిర్యాదు చేయడానికి పోతే బాధితులు మీదే కేసులు నమోదు చేసిన ఘనత కొండపి నియోజకవర్గంలో ఉందన్నారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. మంత్రి ప్రోద్బలంతో రెండు కుటుంబాల మధ్య గొడవను.. పార్టీ గొడవగా చేసి ఐదుగురుపై హత్యాయత్నం కేసులు పెట్టారని ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక భాగం అన్నారు. ఎస్‌ఎంసీ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ప్రభావాన్ని నిరూపించాలన్నారు. మండలంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు 722 గుర్తింపు కార్డులు వచ్చాయని మిగిలిన కార్డులు కూడా త్వరలో వస్తాయని తెలిపారు. అనంతరం కార్డులు పంపిణీ చేశారు. ముందుగా గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ బచ్చల కోటేశ్వరరావు గ్రామనాయకుడు గౌరెడ్డి రమణారెడ్డి, మండాది బ్రహ్మారెడ్డి, మండల సీనియర్ నాయకులు గొట్టిపాటి మురళి మండవ మాలకొండయ్య, వేముల రమేష్, వైస్ ఎంపీపీ వేముల ప్రసాద్, మా రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి మాదాల సుబ్బారావు, ఆళ్ల శ్రీనివాసరెడ్డి, మోపర్తి నారాయణ, మోటుపల్లి గోవిందు, ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, రమణయ్య, శ్రీను, సుల్తాన్, హరి నారాయణ, చిన్నబ్బాయి, నజీర్ శ్రీనివాస్, శ్రీను, రామయ్య, శ్రీహరి, కోటి,చిన్న వసంత్, కొండారెడ్డి, సాంబశివరావు, శివరాం పాల్గొన్నారు.
సంతనూతలపాడు: ప్రైవేట్ వ్యక్తుల భూమిలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వీల్లేదంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకోవడంతో సంతనూతలపాడు మండలం గంగవరం గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. తరతరాలుగా శ్మశాన వాటికగా వినియోగిస్తున్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు అడ్డుకోవడంపై దళితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గంగవరం ఎస్సీ కాలనీకి చెందిన గుడిపూడి సుబ్బారావు (65) సోమవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన బంధువులు మృతదేహాన్ని పూర్వీకుల కాలం నుంచి శ్మశానవాటికగా వినియోగిస్తున్న స్థలానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులకు చెందినదని, అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి లేదని అధికారులు చెప్పడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి అదే ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు అకస్మాత్తుగా ప్రైవేట్ స్థలమంటూ మృతదేహాన్ని కూడా ఖననం చేయకుండా అడ్డుకోవడం ఏమిటని ఎస్సీ కాలనీకి చెందిన మాదిగ కులస్తులు ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకపోవడంతో బంధువులు మృతదేహంతో సుమారు ఆరు గంటల పాటు నిరసన చేపట్టారు.
11 ఎకరాల కుంటపై వివాదం
బొడ్డువారిపాలేనికి చెందిన నూతలపాటి వెంకట సుబ్బయ్య పేరుతో కుంట సర్వే నంబర్ 39లో సుమారు 11 ఎకరాల భూమి ఉన్నట్లు ఎస్సీ కాలనీ ప్రజలు తెలిపారు. ఈ భూమి యాజమాన్య హక్కులపై కొంతకాలంగా వివాదం కొనసాగుతోందని పేర్కొన్నారు. వెంకట సుబ్బయ్య కుమారుడు సర్వే నంబర్ 39లోని భూమి తమ కుటుంబానికి చెందినదని పేర్కొంటూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని అంత్యక్రియలను అడ్డుకున్నారని ఎస్సీ కాలనీ ప్రజలు ఆరోపించారు. అయితే సర్వే నంబర్ 39లోని 11 ఎకరాల భూమిలో దాదాపు 50 సెంట్ల స్థలాన్ని తమ పూర్వీకుల కాలం నుంచి శ్మశానవాటికగా వినియోగిస్తున్నామని తెలిపారు. తమ పూర్వీకుల సమాధులు, శ్మశానవాటిక ఆనవాళ్లు అక్కడ ఉన్నాయన్నారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు శ్మశానవాటిక స్థలంపై కన్నేశారని వారు ఆరోపించారు. రాజకీయ అండతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, శ్మశానవాటికను తొలగించేందుకు, స్థలాన్ని చదును చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, వాటిని తాము అడ్డుకున్నామని తెలిపారు.
కుంట భూమికి పట్టా ఎలా ఇచ్చారు?
సర్వే నంబర్ 39లోని సుమారు 11 ఎకరాల కుంట భూమికి అసలు పట్టా ఎలా వచ్చింది? పట్టా ఇచ్చే సమయంలో ఆ భూమి స్వరూపాన్ని అధికారులు ఎలా నిర్ధారించారు? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. కుంటగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్న ఈ భూమి ప్రైవేట్ వ్యక్తుల పేరుపైకి ఎలా వచ్చింది? అప్పటి రెవెన్యూ రికార్డుల్లో భూమి స్వరూపం ఏమిటి, అనంతరం ఆ భూమికి ఏమైనా లావాదేవీలు జరిగాయా అనే వివరాలను బయటపెడితే అసలు విషయం వెలుగులోకి వస్తుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. శ్మశానవాటిక స్థలంలోని మట్టిని శాసీ్త్రయంగా పరీక్షిస్తే అక్కడ ఎన్నో ఏళ్లుగా అంత్యక్రియలు జరిగిన ఆనవాళ్లు బయటపడతాయని పేర్కొన్నారు.
ఇరువర్గాలతో తహసీల్దార్ చర్చలు:
నిరసన నేపథ్యంలో తహసీల్దార్ ఎస్.ఎల్. నారాయణ రెడ్డి ఇరువర్గాలతో చర్చలు జరిపి, కుంట భూమిలోని ఒక మూలన సుమారు 40 సెంట్ల స్థలాన్ని శ్మశానవాటిక కోసం కేటాయించి చూపించడంతో మాదిగ కులస్తులు అంగీకరించారు. దీంతో గంటల తరబడి కొనసాగిన నిరసన విరమించి, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు మార్గం సుగమమైంది.
అంత్యక్రియల కోసం సుబ్బారావు మృతదేహం వద్ద వేచి చూస్తున్న బంధువులు
అధికారులతో మాట్లాడుతున్న గంగవరం ఎస్సీ కాలనీ వాసులు


