అభ్యంతరాలకు ఈ నెల 24 వరకు అవకాశం
మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కింద ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెల్లించేందుకు గతంలో గెజిట్, సామాజిక ఆర్థిక సర్వేల్లో వివరాలు నమోదు కాకుండా మిగిలిపోయిన వారు, అలాగే 2026 ఆగస్టు 31 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని మేజర్లుగా మారిన వారి అభ్యర్థనలను ప్రభుత్వం పరిశీలించినట్లు కలెక్టర్ విజయసునీత వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి మేజర్‌కు రూ.2 లక్షలు, గెజిట్‌లో వివరాలు మిస్సయిన ప్రతి ఒక్కరికీ రూ.12.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఆ మేరకు డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలు అర్జీలను పరిశీలించినట్లు తెలిపారు. ఈ విచారణలో ఆగస్టు 31 నాటికి మేజర్లుగా గుర్తించిన 731 మందిని, గెజిట్‌లో మిస్సయిన 321 మందిని ప్రాథమికంగా అర్హులుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ అర్హుల జాబితాలను మార్కాపురం ఆర్డీవో కార్యాలయంతో పాటు పెద్దారవీడు, మార్కాపురం, అర్ధవీడు తహశీల్దార్ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు 6,158 నిర్వాసిత కుటుంబాలకు రూ.758.31 కోట్ల పరిహారం చెల్లించినట్లు కలెక్టర్ వెల్లడించారు. మరో 439 కుటుంబాలకు రూ.54.91 కోట్ల బిల్లులను అప్‌లోడ్ చేయగా, ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే వారి ఖాతాల్లో పరిహారం జమ కానుందని తెలిపారు. మరో 349 మందికి సంబంధించిన బిల్లులు ప్రస్తుతం సీఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ ప్రక్రియలో ఉన్నాయని, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్న 18 మంది, సరైన ప్రామాణిక ఆధారాలు సమర్పించని 185 మందికి సంబంధించిన అవార్డులు ఇంకా పాస్ కాలేదని తెలిపారు. అలాగే 172 మందిని అనర్హులుగా గుర్తించడంతో వారికి పరిహారం నిలిపేసినట్లు వివరించారు.
24వ తేదీ వరకు అభ్యంతరాలు:
ప్రాథమిక జాబితాలపై ఎవరివైనా అభ్యంతరాలు, సవరణలు ఉంటే సెప్టెంబరు 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సంబంధిత తహశీల్దార్ కార్యాలయం, మార్కాపురం ఆర్డీవో కార్యాలయం లేదా కలెక్టరేట్‌లో అభ్యంతరాలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. అందిన అభ్యంతరాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం తుది జాబితాను ప్రకటించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పరిహారం చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం విడుదలైన జాబితాలో పేరు లేకపోయినా వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. మిగిలిన దరఖాస్తులను జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా విచారణ చేయించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నిబంధనల మేరకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


