● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
సంతమాగులూరు (అద్దంకి): పూరింటిపై పిడుగు పడిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన మండలంలోని ఏల్చూరులో శుక్రవారం రాత్రి జరిగింది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన గుంజి అంకమ్మరావు కుటుంబ సభ్యులు నలుగురు తమ పూరింట్లో పడుకుని నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద వర్షం వచ్చింది. ఇల్లు కారుతుండటంతో కటుంబ సభ్యులు బయటకు వచ్చారు. అంతలోనే ఒక మెరుపు మెరిసి గుడిసైపె పిడుగు పడింది. దీంతో క్షణంలో మంటలు పైకి ఎగిశాయి. కొద్ది సేపట్లోనే గుడిసె, అందులోని వంట పాత్రలు, రూ.20 వేల నగదు, ఇతర పత్రాలు కాలిపోయాయని బాధితులు వాపోయారు. కట్టుబట్టలతో మిగిలామని విలపించారు.
పిడుగుపాటుకు పశుపోషకుడి మృతి
వెలిగండ్ల (కనిగిరి రూరల్): మండలంలోని మల్లంరాజుపల్లిలో పిడుగుపాటుకు పశుపోషకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఈ తరుణంలో పశుపోషకుడు కె.రామిరెడ్డి (65) గొర్రెలు తోలుకుని వచ్చేందుకు ఇంటి పక్కనే ఉన్న పొలం వెళ్లాడు. పొలంలో ఉన్నట్టుండి పిడుగు పడటంతో రామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.


