మార్కాపురం రూరల్: గ్రానైట్ లారీ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన మార్కాపురం మండలంలోని నికరంపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన గ్రానైట్ లారీని ద్విచక్రవాహనంపై వెళ్తున్న బద్వేల్ సురేష్ (40) అనే వ్యక్తి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కంభం మండల కేంద్రంలోని అర్బన్ కాలనీకి చెందిన సురేష్.. కుంట నుంచి కంభం వైపు వెళ్తుండగా కోమటికుంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సురేష్ గతంలో వలంటీర్‌గా పనిచేయడంతో పాటు డ్యాన్స్ మాస్టర్‌గా గుర్తింపు పొంది ఉన్నాడు. ప్రస్తుతం ఓ ప్రైవేటు మల్టీలెవల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేష్ తల్లి తోపుడు బండిపై మిఠాయి విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. స్థానికంగా అధికారులు, నాయకులు, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగే సురేష్ మృతితో కంభంలో విషాధం అలముకుంది. అతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


