మార్కాపురం: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిరాశ్రయులైన 11 ముంపు గ్రామాల ప్రజలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు ఎక్కడ కల్పిస్తారని వైఎస్సార్ సీపీ ప్రతినిధి పత్తి రవిచంద్ర జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించారు. మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలు ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గానికి తరలివచ్చారని, వీరంతా రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎక్కడ ఓటు వేయాలో అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి డీఆర్‌వో వెంకట శివరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ కార్యక్రమంలో పలువురు ఓటర్లు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారని, మరి ఈ ఎన్నికల్లో మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా? లేదా? అనేది తేల్చాలన్నారు. సర్ జాబితాను సమగ్రంగా పరిశీలించి నూతన జాబితాను రూపొందించాలని, ఓటర్ల సందేహాల నివృత్తికి ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. కాగా, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు తాజా ఓటర్ల జాబితానే వినియోగించాలని రాజకీయ పార్టీల నాయకులు కోరారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై చర్చ
మార్కాపురం జిల్లా పరిధిలోని జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 990 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 7,55,731 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఓటర్ల కేటాయింపు, కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, దివ్యాంగులకు ర్యాంపులు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల ఎంపీటీసీ పరిధిలోని ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా, అందుబాటులో ఉండే ప్రదేశాల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని, రాజకీయ పార్టీలకు పూర్తి సమాచా రం అందిస్తామని తెలిపారు. డీడీవో డాక్టర్ సుజాత, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


