పొగాకు రైతుల సత్తా చూపిస్తాం | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుల సత్తా చూపిస్తాం

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

ఒంగోలు టౌన్‌: గత 90 రోజులుగా రోడ్డెక్కి పోరాటాలు చేస్తున్నా పొగాకు కొనుగోలు చేయకుండా ప్రభుత్వం, పొగాకు బోర్డు, కంపెనీలు తాత్సారం చేస్తుండటంతో విసిగివేసారిన రైతులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 కల్లా పొగాకు కొనుగోలు చేయకపోతే 29న జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 7వ తేదీ చలో అమరావతి కార్యక్రమం చేపడతామన్నారు. తద్వారా రైతుల సత్తా ఏంటో చూపుతామని తేల్చి చెప్పారు. ఒంగోలు మల్లయ్యలింగం భవనంలో ఆదివారం నిర్వహించిన సంయుక్త కిసాన్‌ మోర్చా సమావేశానికి ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డే హనుమారెడ్డి అధ్యక్షత వహించగా, మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు పాల్గొని మాట్లాడారు. వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 28వ తేదీలోపు రూ.1000 కోట్లు కేటాయించకపోతే 29వ తేదీ జిల్లాలోని సింగరాయకొండ నుంచి మద్దిపాడు మండలంలోని గ్రోత్‌ సెంటర్‌ వరకు రాష్ట్ర, జాతీయ రహదారులను దిగ్బంధించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పొగాకు అధికంగా పండించే ప్రాంతాల్లో రైతాంగాన్ని చైతన్యపరుస్తూ ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు బైకులతో చైతన్య యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. పొగాకు రైతులతో పాటుగా మొక్కజొన్న, శనగ రైతులతో రహదారులను దిగ్బంధిస్తామన్నారు. వర్జీనియా పొగాకు వలన దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మాదక ద్రవ్యం వస్తుందని తెలిపారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు బోర్డును ఏర్పాటు చేసి పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు 1975 నాటికే చట్టం చేశాయని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కడం వలన పొగాకు సంక్షోభం వచ్చిందన్నారు. పొగాకు వ్యాపారులు ప్రీ వెరికేటర్లతో చేతులు కలిపి వంచనతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 7వ తేదీ చలో అమరావతి కార్యక్రమం చేపడతామని తేల్చి చెప్పారు. జుజ్జురి జయంతిబాబు, ఎస్‌.లలిత కుమారి, కోడూరి నాంచార్లు, కొండ్రగుట్ల సుబ్బారావు, పమిడి వెంకటరావు, పి.ప్రభాకర్‌, చెరుకూరి శ్రీనివాస్‌, పరిటాల కోటేశ్వరరావు, హనుమంతరావు, జి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయకుంటే

జాతీయ రహదారులను దిగ్బంధిస్తాం

ఈ నెల 23 నుంచి 26 వరకు బైకులతో పొగాకు రైతుల చైతన్య యాత్ర

29న జాతీయ, రాష్ట్రీయ రహదారుల దిగ్బంధం

అప్పటికీ స్పందించకపోతే ఆగస్టు 7న చలో అమరావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement