● మాజీ ఎమ్మెల్యేలు అన్నా, జంకె, కేపీలకు వినతిపత్రం అందజేత
మార్కాపురం టౌన్: జీఓ నంబరు 396ను వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సోమవారం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబుకు, మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డి, సీపీఐ నాయకుడు అందె నాసరయ్యతో పాటు పలువురు నాయకులకు అందజేశారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరుల సంఘ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు మాట్లాడుతూ దాదాపు 40 నుంచి 50 మంది దస్తావేజు లేఖరులు ఏళ్ల తరబడి ఈ వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబరు 396ను ఉపసంహరిచుకునేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా 10 రోజుల పాటు పెన్‌డౌన్ చేపట్టామన్నారు. కార్పొరేట్ సంస్థలకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న దస్తావేజు లేఖరులు రోడ్డున పడనున్నారని మాజీ ఎమ్మెల్యే అన్నాకు వివరించారు. కార్యక్రమంలో స్టార్ మస్తాన్, వీ శ్రీను, బూదాల బెంజిమెన్, జహీర్ రాజా, జంకె వెంకటేశ్వరరెడ్డి, గొగిరెడ్డి లక్ష్మిరెడ్డి, కుమార్ స్వామిరెడ్డి, ఐ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో..
ఒంగోలు సిటీ: ఒంగోలులో కూడా దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్ చేసి నిరసన తెలిపారు. దస్తావేజు లేఖరుల ఉపాధికి గండికొట్టే జీఓ నంబర్ 396ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు వారికి మద్దతు తెలిపారు.


