పరిశ్రమ నల్లబడి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమ నల్లబడి

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

యుద్ధం, ముడిసరుకు ధరలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు

చీమకుర్తి పరిసరాల్లోని 1200 పరిశ్రమల్లో 300కు పైగా మూత

ఏఎంఆర్‌ పాస్‌ల విధానంతో అధిక నష్టాలు

ఎన్నికల ముందు చార్జీలు పెంచమంటూనే ట్రూఅప్‌తో బాదేశారు

నిర్వాహకులకు భారంగా మారిన విద్యుత్‌ చార్జీలు

ప్రభుత్వం నుంచి రాని సబ్సిడీ

గ్రానైట్‌కు గడ్డు రోజులు..

చీమకుర్తి రూరల్‌:

కప్పుడు దేశ, విదేశాలకు గ్రానైట్‌ ఎగుమతుల్లో అగ్రగామిగా చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్‌ పరిశ్రమ నిలిచింది. చీమకుర్తి, రామతీర్థం, బూదవాడ, యల్లయ్యనగర్‌, మర్రిచెట్లపాలెం, సంతనూతలపాడుల్లో 1200లకు పైగా పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌కు చైనాతో పాటు గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువ డిమాండ్‌ ఉంది. ముడిరాళ్లు ఎక్కువగా చైనాకు, పాలిష్‌ చేసిన స్లాబులు ఇరాన్‌, ఇరాక్‌, ఖతార్‌, సౌదీ, కువైట్‌, దుబాయ్‌, వియత్నాంలకు ఎగుమతులు జరుగుతున్నాయి. ఇరాన్‌, ఇజ్రాయిల్‌, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒకప్పుడు ఇక్కడ నుంచి నెలకు సుమారు 5 వేలకు పైగా కంటైనర్లు సముద్రమార్గం ద్వారా ఎగుమతులు జరిగేవి. కరోనా తరువాత ఎగుమతులు భారీగా పడిపోయాయి. యుద్ధానికి ముందు 2500 నుంచి 3 వేల కంటైనర్లు వెళ్తున్నాయి. యుద్ధంతో దాదాపు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇది ఈ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యుద్ధానికి తోడు ఏఎంఆర్‌ సంస్థ అమలు చేస్తున్న పాస్‌ల విధానం కూడా పరిశ్రమలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు ఆరోపిస్తున్నారు. క్వారీల నుంచి మైనింగ్‌ బిల్లుతో ముడి రాయిని కొనుగోలు చేసి ప్రాసెసింగ్‌ అనంతరం ఫినిషింగ్‌ మెటీరియల్‌ను విక్రయించే సమయంలో పరిశ్రమల యజమానులు ప్రభుత్వానికి రాయల్టీతో పాటు ఇతర చెల్లింపులు చేస్తున్నా బయ్యర్లకు ఏఎంఆర్‌ సంస్థ కేవలం రూ.35 వేలకే పోర్టుకు గ్రానైట్‌ ఫినిషింగ్‌ మెటీరియల్‌ తరలించే పాస్‌లు జారీ చేస్తుండటంతో పరిశ్రమల వద్ద బిల్లుతో కొనుగోలు చేసే పరిస్థితి తగ్గిపోయిందని అంటున్నారు. ప్రభుత్వానికి చెల్లించిన రాయల్టీ, మైనింగ్‌ బిల్లుల వ్యయం తిరిగి రాక పరిశ్రమల యజమానులు ఆర్థిక భారీ నష్టాలను చవిచూస్తున్నట్లు వాపోతున్నారు. రెండు కట్టర్లతో పనిచేసే ఒక గ్రానైట్‌ పరిశ్రమ ప్రతి నెలా సుమారు 44 మీటర్ల రాయికి ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాల్సి వస్తోందని, ఆ వ్యయాన్ని ఫినిషింగ్‌ మెటీరియల్‌ అమ్మకాల ద్వారానే భర్తీ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అయితే బయ్యర్లు ఏఎంఆర్‌ పాస్‌లను వినియోగించడంతో పరిశ్రమల ద్వారా జరిగే బిల్లింగ్‌ తగ్గిపోయి, పరిశ్రమలను కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న గ్రానైట్‌ పరిశ్రమను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఏఎంఆర్‌ పాస్‌ల విధానాన్ని సమీక్షించాలని, పరిశ్రమలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల యజమానులు విజ్ఞప్తి చేశారు.

బ్లాక్‌ లో మైనింగ్‌ బిల్లు

నెలలో 20వ తేదీ వరకు 1 మీటరుకు రూ.1500 నుంచి 1700 వరకు మైనింగ్‌ బిల్లు అమ్ముతుంటారు. 25వ తేదీ దాటగానే ఒక మీటరుకు రూ.2 వేల నుంచి రూ.2500 వరకు మైనింగ్‌ బిల్లు విక్రయిస్తారని గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement