దర్శి: రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తావు చంద్రబాబు.. అని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కేవీ పిచ్చయ్య ప్రశ్నించారు. ఆగస్టు 8 నుంచి 9వ తేదీ వరకు జరిగే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా 19వ మాహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేసి మెగా డీఎస్సీ విడుదల చేసి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొనకొండ పారిశ్రామిక క్యారిడార్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, జిల్లాలో డీఎస్సీలో ఖాళీ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయో వాటన్నింటినీ భర్తీ చేయాలని, రామాయపట్నం పోర్టు బీపీసీఎల్ ఇండో సోలార్ కంపెనీల్లో నిర్వాసితులు, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం పోరాడే సంఘం ఒక్క డీవైఎఫ్‌ఐ మాత్రమే అన్నారు. అందరికీ విద్య అందరికీ ఉపాధి లక్ష్యంతో డీవైఎఫ్‌ఐ సంఘం పనిచేస్తోందని, జిల్లా మహాసభల్లో ఈ సమస్యలన్నింటిపై చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. డీవైఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు షేక్ పీరా సాహెబ్, మండల కార్యదర్శి ఆర్.జెస్సిపాల్, మండల ఉపాధ్యక్షుడు కళ్యాణ్ పాల్గొన్నారు.


