వివాదాస్పదంగా మార్కాపురం భ్రమరా వెంచర్ వారం రోజులుగా వెంచర్ వద్ద వివాదం స్థల యజమానులు, రైతులతో కలసి ఎమ్మెల్యే కందుల అనుచరుల ఆందోళన వివాదం ముదరడంతో రెండు వర్గాల ఘర్షణలు మార్కాపురం ఎమ్మెల్యే కందులే ఇదంతా చేయిస్తున్నాడని గుంటూరు ఎమ్మెల్యే గల్లా ఆరోపణలు
మార్కాపురం: ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ‘సివిల్’ వార్‌కు దారితీసింది. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరవర్గాలు నడి రోడ్డుపైనే ఘర్షణ పడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేశారని రైతులతో కలసి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అనుచరులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి తీవ్రంగా స్పందించారు. మార్కాపురం ఎమ్మెల్యేనే ఇదంతా చేయిస్తున్నాడంటూ తన సొంత మీడియా గ్రూప్‌లో సోమవారం రాత్రి పోస్ట్ చేయించడం సంచలనాన్ని రేకెత్తించింది. ప్రస్తుతం వీరి మధ్య వివాదం టీడీపీ అధిష్టానం వద్దకు చేరినట్టు తెలిసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా కేంద్రమైన మార్కాపురంలో గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త భ్రమరా వెంచర్స్ పేరుతో రెండేళ్ల క్రితం 91 ఎకరాల్లో ప్లాట్లు వేశారు. వెంచర్‌కు రహదారి కోసం ఉన్న పలువురు స్థల యజమానుల నుంచి స్థలాలను తీసుకుని, రోడ్డు వేశారు. ఇక్కడే వివాదం మొదలైంది. భ్రమరా వెంచర్స్ రహదారికి ఇరువైపులా ఫెన్సింగ్ వేశారు. దీంతో రహదారికి ఇరుపక్కలా ఉన్న స్థలాలకు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో వారం రోజులుగా ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. స్థలాల యజమానులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. రైతులు, స్థల యజమానులు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల మేరకు ఆర్టీఓ, ఎమ్మార్వో, ఇరిగేషన్ అధికారులు వెంచర్ వద్దకు వెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా వేసిన ఫెన్సింగ్‌ను తీసివేశారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ఘర్షణలో భ్రమరా వెంచర్స్‌కు చెందిన ఇద్దరు, స్థల యజమాని ఒకరు గాయపడ్డారు. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారంపై మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి దాడి చేయించారని గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త ఆరోపించారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అధికారులతో కుమ్మకై ్క భ్రమర వెంచర్‌ని ధ్వంసం చేశారని ఎమ్మెల్యే మాధవి పేరుతో ఉన్న మీడియా గ్రూపులో ఆమె పీఆర్‌ఓ సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల జేశారు. భ్రమర సంస్థ ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు కూడా తమపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు కమిషనర్‌గా ఉన్నప్పుడు పులి శ్రీనివాసులు అవినీతిని ఎమ్మెల్యేగా గల్లా మాధవి ప్రశ్నించారని, దానిని దృష్టిలో పెట్టుకొని ఆయన తమ సంస్థపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు సంచలనాన్ని రేకెత్తించాయి.
అధిష్ఠానం దృష్టికి ఎమ్మెల్యేల పంచాయితీ..
రియల్ వెంచర్ విషయంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయిలో జరుగుతున్న వివాదం ఆ పార్టీ అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. చిన్న బాస్ దృష్టికి కూడా ఈ విషయాన్ని చేరవేసినట్టు సమాచారం.


