మహిళలు తలదించుకునేలా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోంది పిల్లలకు, మహిళలకు రక్షణ కరువు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ
ఒంగోలు సిటీ: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మహిళలపై దాడులు, పిల్లలపై లైంగికదాడులు అధికమయ్యాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం దుంపా రమణమ్మ అధ్యక్షతన ఒంగోలులోని అంబేడ్కర్ భవనం నుంచి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీగా వెళ్లారు. అనంతరం వినతిపత్రం అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉంచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దుంపా రమణమ్మ మాట్లాడుతూ రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గుంటూరులో మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటనతో అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళకు న్యాయం చేసే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
హామీల అమలులో విఫలం:
హనుమంతునిపాడు ఎంపీపీ గాయం సావిత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకపాలన, అక్రమ కేసులతో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యకర్తల కోసమే పనిచేస్తోందన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏ పనిచేయాలన్నా డబ్బులు దోచుకోవడమే పనిపెట్టుకొని ఆరాచకాలు చేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ల పరిపాలనలో ఇలాంటి కీచకపర్వాలు జరగలేదన్నారు. రోడ్డు పై ఒక మహిళను వివస్త్రను చేయడం దారుణమన్నారు. గంజాయి బ్యాచ్ ఎక్కువయ్యారని, వీటిని అరికట్టకపోతే త్వరలోనే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఒక మహిళా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటన్నారు.
పోలీస్ వ్యవస్థల నిద్రపోతుందా..
మాజీ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పులి శాంతి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కీచకపాలన నడుస్తోందని విమర్శించారు. అత్యాచారాలు, హత్యలు, అరాచకం వంటి సంఘటనలు రాష్ట్రంలో పెచ్చరిల్లుపోయాయన్నారు. గుంటూరులో మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు చేస్తే తాట తీస్తాం అన్న పవన్‌కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు..? పవన్‌కళ్యాణ్ మీకు సోషల్ మీడియా లేదా, ఒక వాయిస్ మెసేజ్ ఇవ్వలేరా అని ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్ధ ఉందా లేక నిద్రపోతుందా అని ప్రశ్నించారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ సభ్యురాలు బత్తుల పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో పిల్లలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఎక్కడ చూసినా మహిళలు, పిల్లల్లో అభద్రతా భావం ఏర్పడిందన్నారు. స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తిరిగివస్తారో లేదో అనే భయంలో ఆందోళనలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పట్టపగలే ఒక మహిళను రోడ్డుపై కొట్టి వివస్త్రను చేసి, జాకెట్ చించి ఆమెను అన్ని రకాలుగా అవమానించిన సంఘటనతో రాష్ట్రంలో ఒక కీచకపాలన నడుస్తోందన్నారు. ఒక మహిళా హోంమంత్రి ఉండి కూడా మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. స్కూల్, కాలేజీ, అసలు మహిళలకు ఎక్కడ భద్రత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు శాంతి భద్రతలు కల్పించలేని పరిస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందని విమర్శించారు. గత ప్రభుత్వంలో పిల్లల కోసం రక్షణ కమిటీలు, మహిళల కోసం యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేశారని, ఇప్పుడు అవి ఎక్కడ పనిచేస్తున్నాయని ప్రశ్నించారు.
కార్యక్రమంలో రాష్ట్ర అంగన్‌వాడీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని సుజాత, ఒంగోలు సిటీ మహిళా అధ్యక్షురాలు షైక్ రషీద, స్టేట్ మహిళ విభాగం జనరల్ సెక్రటరీ సన్నపురెడ్డి రమణమ్మ, జిల్లా అంగన్‌వాడీ అధ్యక్షురాలు పసుమర్తి గోవిందమ్మ, సిటీ అంగన్‌వాడీ అధ్యక్షురాలు శోభలత, సంతనూతలపాడు ఎంపీపీ బుడం గుంట విజయ, కొండపి మాజీ ఏఎంసీ చైర్మన్ ప్రభావతి, సంతనూతలపాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నారా విజయలక్ష్మి, రాష్ట్ర కల్చర్ వింగ్ అధ్యక్షురాలు కాకర్లపూడి రజిని, జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ సంధ్య, మహిళా నాయకులు బడుగు మాధవిలత, సాధం విజయలక్ష్మి, బొప్పరాజు జ్యోతి, నాగమణి, సుస్మిత, మహిళలు నాయకులు, ఒంగోలు నగర అధ్యక్షులు కఠారిశంకరరావు, సంతనూతలపాడు మండల అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు పల్నాటి రవీంద్రారెడ్డి, చెంచిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వర్లు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


