గురుకులం సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

గురుకులం సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఇవ్వాలి

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

ఒంగోలు టౌన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తుందని, ఇప్పటికై నా వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.రమేష్‌ కోరారు. ఈ మేరకు సోమవారం స్పందనలో కలెక్టర్‌ పి.రాజాబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం రమేష్‌ మాట్లాడుతూ అంబేడ్కర్‌ గురుకులంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు సేవా సుప్రీం ఏజెన్సీ సకాలంలో వేతనాలు చెల్లించకుండా వేధిస్తోందని తెలిపారు. నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించకుండా కేవలం రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. సెక్యూరిటీ గార్డులుగా తీసుకొని వీరి చేత సంబంధంలేని అదనపు పనులు చేయిస్తున్నారని, స్వీపింగ్‌, క్లీనింగ్‌, బాత్‌రూములు కడిగించడం వంటి పారిశుధ్య పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఇతర పనులు చేసే సిబ్బంది ఎవరైనా సెలవు పెడితే వారి పనులను సెక్యూరిటీ గార్డుల చేత చేయించడం అలవాటైపోయిందన్నారు. అంతేకాకుండా కార్మిక చట్టాల ప్రకారం సెక్యూరిటీ గార్డులకు సెలవులు ఇవ్వడంలేదని, అత్యవసర సమయాల్లో కూడా సెలవులు మంజూరు చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్‌ఐ, సెలవులు వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే జీతాలు చెల్లించకపోతే ఈ నెల 30వ తేదీ కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎల్‌.స్వాతి, శ్రావణి, వాణి, రజియా, హైమావతి, ప్రియ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement