అన్నింటా అధ్వానమే.. | - | Sakshi
Sakshi News home page

అన్నింటా అధ్వానమే..

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

అన్నింటా అధ్వానమే..

పాఠశాల నిర్వహణ, బోధన రెండింటిలో నిర్లక్ష్యం అర్ధవీడు హైస్కూల్‌ ఆకస్మిక తనిఖీలో ఆర్జేడీ, డీఈఓ మధ్యాహ్న భోజనం, విద్యార్థుల చదువుపై అసంతృప్తి

అర్ధవీడు: పురుగులు పట్టిన అన్నంతో మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంది. విద్యార్థులకు బోధన కూడా అంతంత మాత్రమే. పాఠశాల నిర్వహణ, విద్యాబోధన రెండింటిలోనూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని.. బాధ్యులపై చర్యలు తప్పవని ఆర్జేడీ బీ లింగేశ్వరరెడ్డి, డీఈఏ ఎస్‌ సుబ్బారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 18వ తేదీన అర్ధవీడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పురుగులు పట్టిన అన్నం, మురిగిన కోడిగుడ్లు విద్యార్థులకు పెట్టడంతో వారు అన్నం తినలేక ఇంటికి వెళ్లిపోయిన ఘటనపై ‘మాకొద్దు బాబోయ్‌ ఈ మధ్యాహ్న భోజనం’ అన్న శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు సోమవారం పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. సోమవారం మధ్యాహ్న భోజనం ఆలస్యంగా 2 గంటలకు అందించారు. అప్పటి దాకా విద్యార్థులు ఆకలితో ఉండాల్సి వచ్చింది. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై వివరాలు అధికారులు అడిగి తెలుసుకున్నారు. అన్నంలో పురుగులు కనిపించడం తీవ్ర నిర్లక్ష్యమని, సంబంధిత పాఠశాల హెచ్‌ఎం, ఎంఈఓ ఇంకొల్లు సుజాతతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇకపై మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. భోజన నాణ్యతపై జిల్లా అధికారులకు ఎందుకు తెలియజేయలేదని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వీడాలని మిడ్‌ డే మీల్స్‌ పరిశీలకుడు ఎంఈవో 2 ఎం లక్ష్మీనాయక్‌ ను హెచ్చరించారు. మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నిర్వహణ సరిగా లేదని, ఉపాధ్యాయులు, సిబ్బంది మధ్య సమ న్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు బోధించే విద్య కూడా అంతంత మాత్రంగానే ఉందని, పనితీరు మెరుగు పరుచుకోవాల ని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఇకపై నెలకొకసారి పాఠశాలను సందర్శిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement