అటవీ భూములు అమ్మకానికి.. | - | Sakshi
Sakshi News home page

అటవీ భూములు అమ్మకానికి..

Jul 21 2026 2:12 AM | Updated on Jul 21 2026 2:12 AM

రిజర్వు ఫారెస్టును అమ్ముకుంటున్న పచ్చగద్దలు

ఎన్‌ఆర్‌ఐలు, హైదరాబాద్‌, వైజాగ్‌ ప్రాంతాల వారికి ఎర

నిద్రావస్థలో అటవీశాఖ అధికారులు

కురిచేడు: ఖాళీ జాగా కనిపిస్తే చాలు పచ్చగద్దలు వాలిపోతున్నాయి. అటవీ, రెవెన్యూ భూములు వేటినీ వదలకుండా ఆక్రమించి, అక్రమంగా విక్రయించి టీడీపీ నాయకులు సొమ్ముచేసుకుంటున్నారు. తాజాగా కురిచేడు మండలం పడమర వీరాయపాలెంలో అటవీ భూములపై వారి కన్ను పడింది. వందల ఎకరాలు ఆక్రమించి అనధికారికంగా విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. పడమరవీరాయపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వేనంబరు 8 లో 527.5 ఎకరాల విస్తీర్ణం ఉంది. అందులో సుమారు 200 ఎకరాలు అక్రమంగా విక్రయించారు. సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న ధనికులు, ఎన్‌ఆర్‌ఐలను తీసుకొచ్చి తక్కువ ధరలకు భూములు ఇప్పిస్తామని నమ్మబలికి వారికి కట్టబెడుతున్నారు. ఆ తరువాత దానికి చుట్టూ కంచె ఏర్పాటుచేసి, దున్నించి సాగుచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇటు అటవీశాఖ, అటు రెవెన్యూ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

దొనకొండ మండలం బాదాపురం వద్ద నుంచి కురిచేడు మండలం ముష్ట్ల గంగవరం వద్ద గుండ్లకమ్మ వాగు వరకు అటవీ శాఖకు చెందిన 13 వేల ఎకరాలు భూమి ఉంది. అందులో సర్వే నంబరు 8లో 527.5 ఎకరాల విస్తీర్ణం ఉంది. దానికి హద్దుల కోసం గత 50 ఏళ్లుగా అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదం ఏర్పడింది. అదికాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. మండలంలోని పడమరవీరాయపాలెం గ్రామంలోని ఎస్సీలు, బీసీలు సుమారు 150 మందికి 1988 లో అప్పటి ప్రకాశం జిల్లా కలెక్టర్‌ అబ్బన్న ఆ భూమిలో పట్టాలు ఇచ్చారు. దానిని అటవీశాఖ అడ్డుకునేందుకు కోర్టును ఆశ్రయించింది. దానిపై 2014 లో పడమర వీరాయపాలెం గ్రామ ఎస్సీలు తమ పట్టాలకు హద్దులు చూపాలని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దాంతో అటవీ అధికారులు తమకు సర్వేనంబరు 8 లో ఉన్న భూమి వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉందని రికార్డులు చూపి ఆ పట్టాలను రద్దు చేయించింది. దాంతో గత్యంతరం లేక రెవెన్యూ అధికారులు సుమారు 70 మంది ఎస్సీలకు అదే గ్రామ సర్వేనంబరు 63, 64, 65 లలో పట్టాలు మంజూరు చేశారు. ఇదే అదనుగా భావించిన ఆక్రమణదారులు అటవీ భూములను విక్రయించటం ప్రారంభించారు. దాదాపు 200 ఎకరాలు విక్రయించారు. సర్వేనంబరు 8 లోని భూమి ప్రభుత్వానిదని, దానిని ఆక్రమించినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ఆక్రమణదారులు ఆ బోర్డులను తొలగించి అధికార పార్టీ అండతో క్రయవిక్రయాలు చేపట్టారు. ఆ భూముల్లో సోలార్‌ ప్యానల్‌ లు ఏర్పాటు చేసి బోర్లు వేసి, విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ఏర్పాటు చేసుకుని సాగు చేసుకుంటున్నారు.

అటవీ భూములకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

గ్రామాల్లో లోవోల్టేజి సమస్య ఉంది ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయమంటే మీన మీషాలు లెక్కించే విద్యుత్‌ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలోని భూములకు విద్యుత్‌ లైన్లతోపాటు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా ఇవ్వటం వెనుక ఆంతర్యమేమిటో ఆశాఖ అధికారులకే తెలియాలి. ఇప్పటికై నా కలెక్టర్‌, ఫారెస్టు సెటిల్‌మెంట్‌ అధికారి, అటవీశాఖ ఉన్నతాధికారులు కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేసి అటవీ భూములు విక్రయించిన వారిపై, కొన్న వారిపై, దానిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేసిన వారిపై చర్యలు తీసుకొని అటవీ భూమిని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సుమారు 200 ఎకరాల ఆక్రమణ

వివాదాస్పద అటవీ భూమికి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ లైన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement