వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసులు సిగ్గుచేటు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసులు సిగ్గుచేటు

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

కందుకూరు: ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన రామాయపట్నం పోర్టును ప్రైవేట్‌ వ్యక్తులకు కట్టబెడుతూ మరోపక్క పోర్టు పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో పాటు మరికొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పోర్టు నిర్మాణ పనులు గత ప్రభుత్వంలో ఎంతమేరకు పూర్తి చేశారు, ప్రస్తుత ప్రభుత్వం ఎంత శాతం పనులు పూర్తి చేశారు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రయత్నం చేశారు. అయితే పోర్టు సందర్శనకు అనుమతి లేదంటూ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులను అడ్డుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు నేతలను నిర్బంధించి ముందుకు కదలకుండా వందల మంది పోలీసులు అడుపడ్డారు. పోర్టు నిర్మాణంలో ప్రభుత్వ నిర్వాహకం ఎక్కడ బయటపడుతుందోనని ఉద్దేశంతో పోర్టు సందర్శనకు నేతలను అనుమతించకుడా జాగ్రత్త పడ్డారు. గత ప్రభుత్వంలో దాదాపు పనులు పూర్తి చేసి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించే విధంగా పోర్టును సిద్ధం చేశారు. కానీ రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోగా, ప్రస్తుతం రూ. 5వేల కోట్లు విలువ చేసే పోర్టును కేవలం రూ 1500కోట్లకు తన సొంత మనుషులకు కట్టబెట్టేందుకు టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ రామాయపట్నం పోర్టు పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా వేల మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులతో పాటు, పోర్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులు, స్థానిక నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు నిర్మాణం, నిర్వహణ ఉండాలని నినదించారు. ప్రైవేట్‌ వ్యక్తులకు పోర్టును ఇవ్వడం వల్ల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు దక్కవంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు మాత్రం పోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ఎవర్ని అనుమతించకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్‌

సీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.

వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసులు నమోదు

కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో పాటు మరికొందరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పోర్టు వద్ద జరిగే ఆందోళన కార్యక్రమానికి అనుమతి కోరుతూ బుర్రా మధుసూదన్‌యాదవ్‌ పేరుతో పది రోజులు ముందుగానే పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్వయంగా తన ఈ–మెయిల్‌ ద్వారా పోర్టు సందర్శనకు అనుమతించాలంటూ పోర్టు సీఈఓకు మెయిల్‌ చేశారు. ఈ దరఖాస్తులపై ఎటువంటి సమాధానం ఇవ్వని పోలీసులు, శనివారం వైఎస్సార్‌ సీపీ చేపట్టిన ఆందోళనకు అనుమతి లేదంటూ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై కేసులు నమోదు చేయడం గమనార్హం. చేవూరు గ్రామ వీఆర్వో గల్లా వినోద్‌కుమార్‌ నుంచి ఫిర్యాదు తీసుకుని గుడ్లూరు పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నంబర్‌ 72/2026, 126(2), 189(2), 221, 285ఆర్‌/డబ్ల్యూ, 190 బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ల కింద పలువురు నేతలపై కేసులు నమోదు చేశారు. వీరిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కందుకూరు, కావలి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు బుర్రా మధుసూదన్‌యాదవ్‌, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, గణేశం గంగిరెడ్డి, షేక్‌రఫి, కాపులూరి మధుసూదన్‌, బిల్లా రమణయ్య, చేపల బాలాజీ, అప్పబోయిన రాజేష్‌ తదితరులపై కేసులు నమోదు చేశారు.

అక్రమ కేసులు దుర్మార్గం

పోర్టు పరిరక్షణ కోసం చేసిన ఆందోళనలపై ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు అక్రమంగా కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ చేతగానితనానికి అక్రమ కేసులు ఒక నిదర్శనమన్నారు. ఇటీవల కాలంలో పొగాకు రైతులకు అండగా పోరాటం చేస్తే రైతులపై అక్రమంగా కేసులు పెట్టడం, తాజాగా పోర్టు కోసం పోరాడితే కేసులు పెట్టడం చూస్తుంటే ప్రజా ఆందోళనలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప కేసులకు భయపడి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పోర్టు ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ ఆద్వర్యంలోనే పోర్టు ఉండాలని డిమాండ్‌ చేశారు.

రామాయపట్నం పోర్టు పరిరక్షణ కోసం పోరాడితే కేసులు పెడతారా

ప్రభుత్వ చేతగానితనానికి ఇది నిదర్శనం

వైఎస్సార్‌ సీపీ నేతలపై కేసులను వెంటనే

ఉపసంహరించుకోవాలి

వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి

బుర్రా మధుసూదన్‌యాదవ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement