రైతు కష్టం అగ్నికి ఆహుతి | - | Sakshi
Sakshi News home page

రైతు కష్టం అగ్నికి ఆహుతి

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

రైతు కష్టం అగ్నికి ఆహుతి

సంతనూతలపాడు (చీమకుర్తి): ఏడాది పొడవునా కష్టపడి పండించిన పొగాకు పంట బుగ్గిపాలైంది. ఇంట్లో దాచుకున్న రూ.1.05 లక్షల నగదు కాలిబూడిదైంది. వాటితో పాటు 5 సవర్ల బంగారం, 5 బస్తాల ధాన్యం మంటల్లో కలిసిపోయాయి. పొలానికి సంబంధించిన పాస్‌ పుస్తకాలు, డాక్యుమెంట్లన్నీ దహనమయ్యాయి. పక్కపక్క పోర్షన్లలో అన్నదమ్ములు నివాసం ఉంటున్న పెంకుటిళ్లు పూర్తిగా కాలి బొగ్గులే మిగిలాయి. సంతనూతలపాడు మండలం గంగవరం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకెళ్తే.. ఆదివారం వేకువజామున అందరూ గాఢనిద్రలో ఉండగా, మలసాని శేషయ్యకు చెందిన ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అందరూ ఉలిక్కిపడి లేచి చూసే సరికి ఇంటి నిండా మంటలు ఎగసిపడుతున్నాయి. శేషయ్య భార్య రత్తమ్మ ఇంట్లో, శేషయ్య ఇంటి బయట పడుకున్నారు. ఇంట్లో మంటలకు రత్తమ్మకు మెళకువ వచ్చి బయటకు పరిగెత్తింది. తన భర్తతో పాటు అందరినీ పిలుస్తూ కేకలు వేసింది. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఫైరింజన్‌ కోసం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్‌తో వచ్చిన సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. అప్పటికే ఇంట్లోని అన్నదమ్ముల రెండు పోర్షన్లతో పాటు పొగాకు చెక్కులు, బంగారం, నగదు, ధాన్యం పూర్తిగా కాలిబూడిదయ్యాయి. వాటి విలువ దాదాపు రూ.20 లక్షల వరకు ఉంటుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తహసీల్దార్‌ నారాయణరెడ్డి, వీఆర్‌ఓ దాసరి శ్రీనివాసులు ప్రమాదం జరిగిన ఇంటిని, కాలిపోయిన పొగాకు, వస్తువులను పరిశీలించారు. షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన విధానాన్ని మండల విద్యుత్‌ శాఖ ఏఈ పీ గోపీ పరిశీలించారు. తనను పొగాకు బోర్డు ఆదుకోవాలని, ప్రభుత్వం తమ వంతు సాయం చేయాలని అధికారులకు శేషయ్య విన్నవించుకున్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పెంకుటిల్లు దగ్ధం

15 పొగాకు బేళ్లు, రూ.1.05 లక్షల నగదు, 5 సవర్ల

బంగారం, 5 బస్తాల ధాన్యం బుగ్గిపాలు

సుమారు రూ.20 లక్షల వరకు నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement