● రూ.2 లక్షల పైగా నగదు, 12 మోటార్ సైకిళ్లు, 12 మొబైల్ ఫోన్లు స్వాదీనం
● 13 మంది అరెస్టు
కొనకనమిట్ల: మండలంలోని నాగిరెడ్డిపల్లి సమీపంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పొదిలి సీఐ రాజేష్ సిబ్బందితో మఫ్టీలో వెళ్లి మెరుపు దాడి చేశారు. భారీ బెట్టింగ్‌లతో పేకాట ఆడుతున్న 13 మందిని అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2 లక్షలకు పైగా నగదు, 12 మొబైల్ ఫోన్లు, 12 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం 13 మందిని పొదిలి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు, పేకాట, జూదం, కోడిపందేలు, అసాంఘిక చర్యలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు సీఐ తెలిపారు. కాగా పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో కూటమి నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం
● రూ.40 వేల నగదు, కమ్మలు,
ఉంగరం అపహరణ
పామూరు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం పామూరు సీతారామునితోట 4వ లైన్ మొలకాపురి నారాయణ ఇంట్లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..పామూరు సీతారామునితోట 4వ లైన్‌లో స్థానిక 108 ఈఎంటీ నారాయణ కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. నారాయణ 17వ తేదీ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు 108 వాహనానికి నైట్‌డ్యూటీకి వెళ్లాడు. దీంతో భార్య మల్లీశ్వరి, పిల్లలు రాత్రి 10.30 గంటలకు పడుకునేందుకు వాళ్ల పుట్టింటికి వెళ్లారు. శనివారం ఉదయం ఇంటికి వెళ్లి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళం తీసి ఉండగా అందులోని రూ.40 వేల నగదు, జత బంగారు కమ్మలు, బంగారు ఉంగరం చోరీకి గురయ్యాయి. దీనిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదుచేయనున్నట్లు నారాయణ తెలిపారు.
ముండ్లమూరు: ట్రాన్స్‌ఫార్మర్ చోరీలు ఆగడం లేదు. ఓ పక్క పోలీసులు నిందితులను పట్టుకున్నామని ప్రకటిస్తుంటే మరో పక్క చోరీలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. మండలంలోని పసుపుగల్లులో ఆదివారం తెల్లవారుజామున దుండగులు రెండు ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం చేసి అందులోని రాగితీగను అపహరించారు. గ్రామానికి దక్షిణం వైపు ఉన్న మారం నాగిరెడ్డి, సింగంరెడ్డి రమణారెడ్డిలకు చెందిన రెండు ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. రైతులు ఆదివారం ఉదయాన్నే పొలాలకు వెళ్లగా ట్రాన్స్‌ఫార్మర్లు కనిపించలేదు. అనుమానం వచ్చి దగ్గరికి వెళ్లి చూడగా రెండు ట్రాన్స్ఫారాలను ధ్వంసం చేసి కింద పడేసి అందులోని రాగి తీగను అపహరించారు. లైన్‌మన్ సోమ్లానాయక్ పరిశీలించి ఏఈ అంకబాబుకు తెలియజేశారు. ఎస్సై పి.కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు 14 ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు గస్తు కాస్తున్నా దొంగతనాలు ఆగడం లేదు.
పొదిలి రూరల్: టమోటా లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున కుంచేపల్లి సమీపంలో పాల కేంద్రంలో దగ్గర జరిగింది. వివరాల్లోకి వెళితే..గిద్దలూరు వైపు నుంచి పొదిలి మీదుగా టమోటా కాయలతో బొలెరో వాహనం అద్దంకి వైపు వెళ్తుంది. కుంచేపల్లి దగ్గరకు వచ్చే సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో వాహనం అదుపు తప్పి పక్కన ఉన్న చింత చెట్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వాహనం ముందుభాగం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు కాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో వాహనం నడుపుతున్న కడప జిల్లాకు చెందిన డ్రైవర్ అర్షద్‌వలి వాహనంలో ఇరుక్కుపోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే సంఘటన చేరుకున్నారు. వాహనాన్ని పరిశీలించగా డ్రైవర్ లోపల ఇరుక్కున్న ఉండటంతో వెంటనే డోర్‌ను పగలగొట్టి తీయగా డ్రైవరు అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒంగోలు టౌన్: ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలని, ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకుడు సీహెచ్ మంజుదార్ పిలుపునిచ్చారు. ప్రజా సంఘాల కార్యాయంలో ఆదివారం ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా నాయకురాలు పరిశుద్ధం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంజుదార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. వేతనాల పెంపుతో పాటుగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ధర్నాలో జిల్లాలోని ఆశా వర్కర్లంతా విధిగా పాల్గొనాలని కోరారు. తొలుత ధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కోటేశ్వరమ్మ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


