భ్రమరా వెంచర్స్‌ వద్ద ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

భ్రమరా వెంచర్స్‌ వద్ద ఘర్షణ

Jul 20 2026 7:35 AM | Updated on Jul 20 2026 7:35 AM

మార్కాపురం: గుంటూరు టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి మార్కాపురం పట్టణ శివార్లలో ఏర్పాటు చేసిన భ్రమరా వెంచర్స్‌ వద్ద ఆదివారం సాయంత్రం రైతులకు, వెంచర్స్‌ ప్రతినిధులకు మధ్య జరిగిన ఘర్షణలో నలుగురికి గాయాలయ్యాయి. భ్రమరా వెంచర్స్‌ ప్రతినిధులు తమను తమ పొలాల్లోకి పోనివ్వకుండా ఫెన్సింగ్‌తో పాటు ఇనుప గేట్లు పెడుతున్నారని సమాచారం రావడంతో పలువురు పొలాల రైతులు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో అక్కడ గేట్‌ పెట్టేందుకు జరుగుతున్న సన్నాహాలు చూడటంతో రైతులు వెంచర్స్‌ ప్రతినిధులను ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. భ్రమర సంస్థ ప్రతినిధులు డయల్‌ 100కు కాల్‌ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైతు ఇంతియాజ్‌తోపాటు మరికొందరు తాము గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చామని చెప్పగా.. పోలీసులు తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ విషయంతో తనకు సంబంధం లేదని మున్సిపల్‌ కమిషనర్‌తో మాట్లాడాలని తహసీల్దార్‌ సమాధానమిచ్చినట్లు సమాచారం. గేటు ఉంచాలా.. తొలగించాలా అని తహసీల్దార్‌ను పోలీసులు అడగగా తొలగించాలని సూచించారు. దీంతో ఇరువర్గాలకు సర్దిచెప్పిన పోలీసులు.. సోమవారం తహసీల్దార్‌ను కలిసి మరోమారు మాట్లాడుకోవాలని సూచించి వెళ్లారు. అయితే భ్రమర ప్రతినిధులు తమ ఎండీ ఆదేశాల మేరకు మధ్యాహ్నం సమయంలో గేట్ల వద్ద కాంక్రీట్‌ వర్క్‌ చేయిస్తుండగా ఇంతియాజ్‌ వర్గీయులు వెళ్లి అడ్డగించారు. గేట్లు తొలగించి పక్కన పడేయడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది. తమపై వెంచర్స్‌ ప్రతినిధులు దాడిచేశారని అంబటిపూడి కిరణ్‌, ఆనెకరి మల్లిఖార్జున తెలిపారు. తమను కాళ్లతో తొక్కి స్క్రూడ్రైవర్లతో, ఇతర మారణాయుధాలతో దాడులు చేశారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెంచర్స్‌ నుంచి బయటపడ్డారని తెలిపారు. తాము చట్టప్రకారమే పోతున్నామని వెంచర్స్‌ ప్రతినిధులు అంటున్నారు. ఈ ఘర్షణలో అనీల్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. కిరణ్‌, మల్లిఖార్జున జీజీహెచ్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. గాయపడిన వెంచర్స్‌ ప్రతినిధులు పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయించుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు తెలుసుకుని బాధితుల స్టేట్‌మెంట్‌ కోసం జీజీహెచ్‌కు వెళ్లారు. ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం కూడా తమ పొలాలను ఆక్రమిస్తూ తమకే అమ్మాలని బెదిరిస్తున్నారని పలువురు దళితులు వెంచర్స్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం భ్రమరా వెంచర్స్‌ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

నలుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement