వందల సంఖ్యలో పోలీసుల మొహరింపు
పోర్టు రోడ్డులో రేకులతో అడ్డుగోడ
పది రోజుల ముందే పోలీసులకు సమాచారం ఇచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
అయినా అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగిన వైఎస్సార్‌సీపీ నాయకులు, రైతులు, కార్యకర్తలు
పోలీసులు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాటలు, ఉద్రిక్తంగా మారిన పోర్టు ఏరియా
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం
రామాయపట్నం పోర్టు సందర్శన భగ్నానికి అడుగడుగునా కుట్ర
కందుకూరు:
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్‌యాదవ్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్థానిక రైతులు చేపట్టిన భారీ ఆందోళనను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పక్కా ప్రణాళిక అమలు చేసింది. పోలీసులను అడ్డుపెట్టుకుని పోర్టు పరిసర ప్రాంతాలకు కూడా ఎవరూ వెళ్లకుండా ముందస్తు కుట్రకు తెరతీసింది. దీనిలో భాగంగానే శనివారం పోర్టువైపు వెళ్లిన వైఎస్సార్ సీపీ శ్రేణులను, స్థానిక రైతులు, యువతను అడ్డుకున్నారు. దీని కోసం వందల సంఖ్యలో పోలీసులను మొహరింప చేశారు. డీఎస్పీలు, సీఐలు, పదుల సంఖ్యలో ఎస్సైలు, వందల మంది కానిస్టేబుళ్లను పోర్టు పరిసర ప్రాంతాల్లో మొహరించి అడ్డుకున్నారు. పైగా పోర్టు నిషిద్ధ ప్రాంతం అన్న తరహాలో దరిదాపుల్లోకి కూడా ఎవరూ వెళ్లకుండా భారీ అడ్డంకులు ఏర్పాటు చేశారు. దీని కోసం 16వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న చేవూరు నుంచి పోర్టులోకి వెళ్లే రహదారిని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోర్టుకు కిలోమీటరు దూరంలోనే రోడ్డుకు అడ్డంగా ఇనుప రేకులతో భారీ అడ్డుగోడ కట్టి, పోర్టు పనులకు వినియోగించే భారీ టిప్పర్‌లను రోడ్డుకు అడ్డంగా పెట్టారు. దీనిని చూస్తుంటే ప్రభుత్వం ఏవిధంగా భయపడుతుందో అర్థమవుతుందని, పోర్టు నిర్మాణం సక్రమంగా జరిగితే ఎందుకు ప్రభుత్వం అడ్డుకుంటోందని నిలదీశారు. సందర్శనకు అనుమతి లేదని పోర్టు అధికారులు లెటర్ ఇచ్చారని, వారి ఆదేశాల మేరకు ఎవర్నీ అనుమతించడం లేదంటూ పోలీసులు చెప్పడం గమనార్హం.
అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నా..
పోర్టు ప్రైవేటీకరణ నేపథ్యంలో పోర్టు వద్ద నిరసన వ్యక్తం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ బుర్రా మధుసూదన్ యాదవ్ పేరుతో పోలీసులకు పది రోజుల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా తన సొంత మెయిల్ ద్వారా పోర్టు సీఈఓకి మెయిల్ చేశారు. ఇదే విషయాన్ని పోలీసులు అడ్డుకున్న సందర్భంలో కాకాణి బహిర్గతం చేశారు. అయినా సరే ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోర్టు అధికారులు అనుమతులు ఇవ్వకుండా జాప్యం చేశారు. అలాగే పోర్టు అధికారులకు చేసిన విన్నపానికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. ముందుగా ప్రకటించినట్టుగా ఆందోళనకు దిగారు. అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసులను సహకారంతో కుట్రపన్నిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు
బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే పోర్టుకు భూములిచ్చిన రైతులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారు. తాము ప్రభుత్వ ఆధ్వర్యంలో పోర్టు నిర్మిస్తామంటే భూములు ఇచ్చాం తప్పా, ప్రైవేట్ వ్యక్తులకు కాదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేటీకరించడం వల్ల తమ లక్ష్యంగా నీరుగారిపోతుందని, తమ పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. జీవనోపాధి కోల్పోయిన మత్య్సకారులకు ఇస్తామన్న భృతిని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్టును ప్రైవేట్‌పరం చేస్తే ఊరుకునేది లేదంటూ, ప్రాణాలైనా అర్పించి పోర్టును కాపాడుకుంటామంటూ నినదించారు.
నిరసన ర్యాలీ సందర్భంగా పోలీస్ బందోబస్తు
మహిళా నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
రామాయపట్నం పోర్టును కాపాడాలని వైఎస్సార్ సీపీ పిలుపునిస్తే..
ఆందోళనను అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని
రంగంలోకి దించింది. పోర్టు
దారులన్నింటినీ దిగ్బంధించి, శాంతియుత నిరసనను భగ్నం చేసేందుకు అడుగడునా కుట్రలు పన్నింది. దాదాపు ఐదుగంటల పాటు సహనంగా ఉన్న పార్టీ నాయకులు, రైతులు, యువకులు ఆగ్రహంతో జాతీయ రహదారిపై
బైఠాయించారు. మాజీ ఎమ్మెల్యేలను సైతం లాగిపడేసి అరెస్టు చేయడమే కాకుండా కేసులు పెట్టడం
తీవ్ర విమర్శలకు దారితీసింది.


