ఇరుకు దారిలో.. ప్రాణాలు అరచేతిలో.. | - | Sakshi
Sakshi News home page

ఇరుకు దారిలో.. ప్రాణాలు అరచేతిలో..

Jul 19 2026 12:38 AM | Updated on Jul 19 2026 12:38 AM

ఆర్టీసీ బస్సు తిరగబడిన ఘటనలో గాయాలతో బయటపడిన ప్రయాణికులు డ్రైవర్‌ నిర్లక్ష్యం వలనే ప్రమాదం అని పోలీసులు నిర్ధారణ

సంతనూతలపాడు(చీమకుర్తి): ఆర్టీసీ బస్సు తిరగబడిన ఘటనలో గాయాలు మినహాయిస్తే ప్రయాణికులు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారని బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఉదయం 8.30 గంటల సమయలో కొండపి–సంతనూతలపాడు రూట్‌లో మద్దులూరు రొయ్యల ఫ్యాక్టరీ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రయాణికులు ఆర్తనాదాలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ బయట పడ్డారు. అనకర్లపూడి–మద్దులూరు మధ్య రోడ్డు ఇరుకుగా ఉండటం వలన ఎదురెదురు వాహనాలు ఒక దానికి ఒకటి దారి ఇచ్చే పరిస్థితి లేదు. కొండపి నుంచి సంతనూతలపాడు మీదుగా ఒంగోలు వచ్చే బస్సు మద్దులూరు వద్దకు రాగా.. అదే సమయంలో ఒంగోలు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుకు దారి ఇచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి నియోజకవర్గం కొండపికి రాకపోకలు సాగించే రోడ్డును కూడా కనీసం రెండు బస్సులు తిరిగేటంత వెడల్పు చేసుకోలేకపోవడం దారుణమని, ప్రభుత్వ విధానంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, ఎమ్మెల్యే పరామర్శించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని రొటీన్‌ డైలాగ్‌లు చెప్పి చేతులు దులుపుకున్నారు. ఈ ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన 10 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంతనూతలపాడు ఎంఈఓ ఎన్‌వీఎస్‌ కుమార్‌, చిలకపాడు హైస్కూలు హెచ్‌ఎం స్వప్నరాజు పరామర్శించారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యమని నిర్ధారించిన సంతనూతలపాడు ఎస్సై అజయ్‌బాబు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

కొండపి సీహెచ్‌సీకి క్షతగాత్రుల తరలింపు

కొండపి: సంతనూతలపాడు మండలం పరిధిలో ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు ప్రయాణికులను కొండపి సీహెచ్‌సీకి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీహెచ్‌సీకి 36 మందిని తరలించగా వారిలో స్వల్పగాయాలైన 18 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసి పంపగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన 15 మందిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స చేశారు. బస్సులో సుమారు 75 మంది వరకు ఉన్నారని, బస్సు అంతా నిండుగా ఉందని సీట్లు నిండిపోగా సుమారు 20 మందికి పైగా నిల్చుని ఉన్నారని ఓ ప్రయాణికుడు తెలిపారు. బస్సు కూడా నెమ్మదిగానే వెళుతుందని ఆ క్రమంలో మలుపు వద్దకు రాగానే హఠాత్తుగా ఎదురుగా మరో బస్సు వచ్చిందని, దానిని దాటే క్రమంలో బస్సు డ్రైవర్‌ నెమ్మదిగా బస్సును రోడ్డు మార్జిన్లోకి దించాడన్నారు. కానీ మార్జిన్లు సక్రమంగా లేకపోవటంతో బస్సు ఒక పక్కకు వాలి పోతుండటాన్ని గమనించామని, ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నామని తెలిపారు. చివరకు కొద్దిపాటి దెబ్బలతో బస్సులోంచి బయట పడగలిగామని వివరించారు. చిల్లచెట్లు బాగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement