అంచెలంచెలుగా రామాయపట్నం పోర్టును కాజేసేందుకు పక్కా ప్రణాళిక దీనిలో భాగంగానే పీపీపీ పేరుతో రూ.5 వేల కోట్ల పోర్టును రూ.1500 కోట్లకు అమ్మకం పోర్టు పరిరక్షణకు ఎంతటి పోరాటానికై నా వైఎస్సార్ సీపీ సిద్ధం పోర్టు నిర్వాసితుల ప్రయోజనాలు కాపాడతాం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
కందుకూరు: ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ నిత్యం ప్రజలను మభ్యపెడుతూ మరోపక్క ప్రజల ఆస్తులను దోచుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ పనిచేస్తున్నారని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. రామాయపట్నం పోర్టు ముట్టడి సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. పోర్టు నిర్మాణంలో 95 శాతం పనులు పూర్తయి కేవలం 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ఈ దశలో రూ.5 వేల కోట్లు విలువైన పోర్టుని రూ.1500 కోట్లకు కారుచౌకగా కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. దీని వల్ల పోర్టు కోసం భూములిచ్చిన రైతులు, మత్య్సకారుల ప్రయోజనాలు ఏం కావాలని ప్రశ్నించారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయన్నారు. పోర్టు నిర్మాణంతో జీవనోపాధి కోల్పోయిన మత్య్సకారులను ఆదుకునేందుకు గత ప్రభుత్వం నెలకు రూ.3 వేల భృతిని మత్య్సకారులకు ప్రకటించింది. జగన్ ప్రభుత్వంలో పక్కాగా అందిన భృతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు ఇవ్వడం లేదని కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిలదీశారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకుంటున్న చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్‌ని బంగాళాఖాతంలో కలి పేందుకు ప్రజలు అంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
జగన్ గిఫ్ట్ రామాయపట్నం పోర్టు: బుర్రా
కందుకూరు ప్రాంతానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ రామాయపట్నం పోర్టు అని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. అటువంటి పోర్టును చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పోర్టులో జరిగే అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు వస్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఆందోళనను అడ్డుకునేందుకు మూడు రోజుల నుంచి పోలీసులు వేధిస్తున్నారని చెప్పారు. పోలీసులు ప్రజల మనోభావాలను, ఆస్తులను కాపాడేలే కాని చంద్రబాబు కోసం పనిచేయడం తగదన్నారు. పేదల పొట్టకొట్టేలా నిర్ణయాలు తీసుకుంటూ కేసులు పెడతామంటూ రైతులు, యువతను బెదిరిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటీకరణ నిలిపి వేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పోర్టు నిర్మాణం పూర్తి చేసి నిర్వహించాలని, లేదంటే భవిష్యత్‌లో మరిన్ని పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
తీర ప్రాంత అభివృద్దే లక్ష్యం: రామిరెడ్డి
రామాయపట్నం పోర్టు, జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం ద్వారా తీర ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగానే నాలుగు పోర్టులు, 11 ఫిషింగ్ హార్బర్‌లు చేపట్టారన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం సరైన విధానం కాదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.


