వంగలపూడి అనిత సవాల్ ఏమైంది?: శ్యామల | YSRCP Leader Are Syamala Fires On Chandrababu Government Over Rising Drug Cases, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

వంగలపూడి అనిత సవాల్ ఏమైంది?: శ్యామల

Oct 8 2026 3:10 PM | Updated on Oct 8 2026 3:49 PM

Ysrcp Leader Are Syamala Fires On Chandrababu Government

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం.. యువత భవిష్యత్తుతో ఆడుకుంటోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ గంజాయిని సమూలంగా నిర్మూలిస్తామన్న చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పట్టుబడుతున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపామంటూ సీఎం చంద్రబాబు సినిమా డైలాగులు చెబుతున్నారు. హోంమంత్రి వంగలపూడి అనితకు టీవీ షోల టీఆర్పీలపై ఉన్న శ్రద్ధ గంజాయి కేసులను అరికట్టడంపై లేదు. రాష్ట్రంలో ఆడబిడ్డల ఆర్తనాదాలు హోంమంత్రి అనితకు ఏమాత్రం వినిపించడం లేదు. డేగ కన్నులంటూ ప్రచారం చేసుకుంటున్న ఈగల్ విభాగం సాధించిన వాస్తవ ఫలితాలేంటో స్పష్టం చేయాలి’’ అంటూ శ్యామల నిలదీశారు.

‘‘అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో గంజాయిని లేకుండా చేస్తామన్న హోంమంత్రి సవాల్ ఏమైంది? కూటమి నేతలు ఆడుతున్నది స్ట్రెయిట్ గేమ్ కాదు, యువత భవిష్యత్తును నాశనం చేసే టాక్సిక్ గేమ్. ప్రకాశం జిల్లాలో పోలీసుల కారులోనే గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడం అత్యంత సిగ్గుచేటు. గంజాయి రవాణాలో పోలీసుల పాత్రపై ప్రజలు నిలదీస్తున్నా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి, లిక్విడ్ గంజాయి, యాష్ ఆయిల్, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.’’ అని శ్యామల ధ్వజమెత్తారు.

‘‘హోంమంత్రి చెప్పిన మూడు నెలల డెడ్‌లైన్ తర్వాతే రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆగస్టు 27న గోకవరంలో 75 లక్షల విలువైన 6 లీటర్ల లిక్విడ్ గంజాయి పట్టుబడింది. సెప్టెంబర్ 2న విజయవాడ శివారులో గంజాయి ముఠా దాడిలో కానిస్టేబుల్ గాయపడ్డారు. సెప్టెంబర్ 4న అనకాపల్లిలో 3 కోట్ల విలువైన 600 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 17న విశాఖ పెదగంట్యాడ వద్ద బెంగళూరు నుంచి తెచ్చిన ఎండీఎంఏ డ్రగ్స్ పట్టుబడ్డాయి. సెప్టెంబర్ 27న అల్లూరి జిల్లా పెద్దబయలు వద్ద 1.34 కోట్ల విలువైన లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు. సెప్టెంబర్ 28న అనకాపల్లి జిల్లా కోడూరు జంక్షన్ వద్ద 5.5 కోట్ల విలువైన 43 లీటర్ల యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.

,,ఈ రోజు విశాఖపట్నంలో 50 గ్రాముల ఎండీఎంఏ, లీటర్ యాష్ ఆయిల్ దొరకడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. హోంమంత్రి సొంత జిల్లాలోనే కోట్ల రూపాయల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడుతున్నా స్పందించడం లేదు. ఈగల్ వెబ్‌సైట్ లెక్కల ప్రకారమే 2,444 కేసులు, 6,332 అరెస్టులు, 6 లక్షల కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. రాష్ట్రంలో గంజాయే లేదని ప్రచారం చేస్తూ వెబ్‌సైట్‌లో వేల కేసులు ఎలా చూపిస్తున్నారు. ఆపరేషన్ చైతన్య, ఆపరేషన్ గరుడ, సేఫ్ క్యాంపస్ వంటి కార్యక్రమాల వల్ల ఒరిగింది శూన్యం.

నీకు టీవీ షోల మీద ఉన్న శ్రద్ధ.. వంగలపూడి అనిత సవాల్ ఏమైంది?

జగనన్న ప్రభుత్వంలో ఆపరేషన్ పరివర్తన ద్వారా 90 శాతం గంజాయి సాగును సమూలంగా నిర్మూలించాం. నాడు గంజాయి సాగుదారులకు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు అందించి ప్రభుత్వం ఆదుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో అనకాపల్లి కోడూరులో 2 లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేశాం. పరారీలో ఉన్న 712 మంది నిందితుల్లో ఇప్పటివరకు ఎంతమందిని అరెస్టు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. పట్టుబడుతున్న డ్రగ్స్ వెనుక ఉన్న ప్రధాన ఫైనాన్షియర్లు, సూత్రధారులను ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోంది. విద్యాసంస్థలు, హాస్టళ్ల సమీపంలో డ్రగ్స్ విక్రయాలపై నమోదైన కేసుల వివరాలను జిల్లాలవారీగా వెల్లడించాలి.

రాష్ట్ర యువతకు కావాల్సింది టీవీ షోల వినోదం కాదు, డ్రగ్స్ ముప్పు నుంచి సంపూర్ణ రక్షణ. డ్రగ్స్‌పై కంటితుడుపు ప్రచారాలు కాదు, పూర్తిస్థాయి సరఫరా నెట్‌వర్క్ నిర్మూలన కావాలి. మంగళగిరి పార్టీ ఆఫీస్ ఆదేశాలను పాటిస్తూ హోంమంత్రి అనిత కేవలం కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారు. విపక్ష నాయకులపై నిందలు వేయడం మాని హోంమంత్రి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి డ్రగ్స్ సమస్యను మరింత దిగజార్చింది’’ అని శ్యామల దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: తాతా.. ఈ వయసులో పార్టీ మారి ఏం లాభం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement