తాతా.. ఈ వయసులో పార్టీ మారి ఏం లాభం? | Varupula Satya Prabha Vs Varupula Subbarao | Sakshi
Sakshi News home page

తాతా.. ఈ వయసులో పార్టీ మారి ఏం లాభం?

Oct 8 2026 11:04 AM | Updated on Oct 8 2026 11:11 AM

Varupula Satya Prabha Vs Varupula Subbarao

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాజీ ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మిత్రపక్షం జనసేనలో చేరడం అసమ్మతి జ్వాలలు రేపుతోందా..? టీడీపీ, జనసేనలో వర్గవిభేదాలు భగ్గుమంటున్న తరుణంలో వరుపుల జనసేన కండువా కప్పుకోవడంపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ వర్గం జీర్ణించుకోలేక పోతోందా..? తాత, మనవరాళ్ల మధ్య అంతర్గత పోరు నడుస్తోందా..? చేరిక రాజకీయం ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

తాతా మనవరాళ్ల తంటాలు  
ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వరుసకు తాత, మనవరాళ్లు. ఇటీవల సుబ్బారావు జనసేన తీర్థం పుచ్చుకోవడం సత్యప్రభ వర్గంలో అలజడి రేపుతోంది. ఆమె ఇప్పటికే సొంత పార్టీలో అసమ్మతి సెగ ఎదుర్కొంటోంది. దీనికి తోడు నియోజకవర్గంలో ఆమెకు పెద్దగా వర్గం, మైలేజీ లేవు. ఈ సమయంలో తాత మిత్రపక్షంలో చేరడంపై బహిరంగంగా విమర్శించకపోయినా.. అంతర్గతంగా రగిలిపోతున్నట్లు సమాచారం. వరుసకు తాతే అయినా.. రాజకీయాల్లో ఏ మాత్రం ఎంకరేజ్‌ చేయకూడదని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. భావి ప్రణాళిక ఏంటనే దానిపై ఆమె మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. 

ఇందులో భాగంగానే సుబ్బారావుతో “టచ్‌ మీ నాట్‌’ అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జనసేనలో చేరిన అనంతరం జనసేన నేతలు యనమల కృష్ణుడు, పెండెం దొరబాబు, టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన కుమారుడు జ్యోతుల నవీన్, ఎమ్మెల్యే సత్యప్రభ సైతం సుబ్బారావు ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సత్యప్రభ, వరుపుల మధ్య ఎలాంటి పలకరింపులు లేకుండా ఇద్దరు నేతలూ ఒకరికొకరు ముభావంగా ఉన్న పరిస్థితి ఏర్పడింది. మొహమాటానికి వెళ్లారే తప్ప.. అభినందించేందుకు కాదన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు సాగుతున్న ఆమె హవా ఇకపై సాగదన్న భావన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.  

చక్రం తిప్పిన జ్యోతుల! 
సుబ్బారావు జనసేనలో చేరికకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెరవెనుక మంత్రాంగం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే సత్యప్రభకు సీటు ఇవ్వరన్న టాక్‌ నడుస్తోంది. అందువల్ల ఇప్పటి నుంచే తన అనుయాయుడైన సుబ్బారావును తెరమీదకు తెచ్చినట్లు తెలుస్తోంది. నెహ్రూ, సత్యప్రభలది ఒకే పార్టీ కావడం.. ఎమ్మెల్యేను కాదని టీడీపీలోకి తీసుకువస్తే.. సొంత పార్టీలో ఇబ్బందులు ఎదురవుతాయని భావించి నేరుగా కాకుండా మరో మార్గంలో తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. 2029లో సుబ్బారాను కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దింపేందుకు జ్యోతుల ఇప్పటి నుంచే మార్గం సుగమం చేస్తున్నట్లు తెలిసింది. తద్వారా సత్యప్రభకు చెక్‌ పెట్టాలన్న యోచనలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న తరుణంలో జనసేనలో ఉంటే.. తనకు, తన అనుచరులకు ప్రాధాన్యం దక్కుతుందని వరుపుల లెక్కలు వేసుకుంటున్నట్లు తెలిసింది.  

గ్లాసులో గలాటా..! 
జనసేన పార్టీకి ప్రత్తిపాడు నియోజవర్గంలో ఇప్పటి వరకు ఇన్‌చార్జిని నియమించలేదు. ఇన్‌చార్జ్‌ పదవికి ఇప్పటికే ఇద్దరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఆమెతో పాటు మేడిశెట్టి బాబీ సైతం రేసులో ఉన్నారు. ఇప్పటికే ఇరు వర్గాలు నియోజకవర్గ ఇన్‌చార్జి పదవి కోసం ఎవరికి వారు ముష్టి యుద్ధాలకు దిగుతుంటే.. పానకంలో పుడకలా తరహా సుబ్బారావు వచ్చి ఏం చేస్తారన్న ప్రచారం నడుస్తోంది. స్థానిక ఎన్నికల్లో పార్టీని బట్టి సీట్‌ షేరింగ్‌ ఉంటుంది. పార్టీలో మూడు వర్గాలుంటే.. ఎలాగన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని సుబ్బారావు సన్నాయినొక్కులు నొక్కుతుండటంతో పరిస్థితి ఎంతకు దారితీస్తుందో అన్న చర్చ నియోజకవర్గంలో మొదలైంది.  

రిటైరయ్యే స్టేజ్‌లో ఏం చేస్తారులే..? 
సుబ్బారావు జనసేనలో చేరికపై సత్యప్రభ వర్గీయులు సైతం విమర్శలు ఎక్కుపెట్టినట్లు తెలిసింది. “ఆయన వల్ల ఉపయోగం ఏముంది..? రిటైర్మెంట్‌ వయసులో పార్టీ మారి ఏం చేస్తారు? ఆయన చేరికను లైట్‌గా తీసుకోవాలంటూ’ సత్యప్రభ వర్గం చెప్తున్నట్టు తెలిసింది. గత ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేను ఇష్టమొచ్చినట్లు విమర్శించిన నేతను జనసేన ఎంకరేజ్‌ చేయడం ఏంటని ఎమ్మెల్యే వర్గం మండిపడుతున్నట్లు తెలిసింది. అలాంటి వారితో ఎలా పనిచేస్తామంటూ ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. 

అవకాశాలు అందిపుచ్చుకోవాలి..! 
జనసేనలో చేరిన సుబ్బారావు మాత్రం రాజకీయాలంటే చాలా ఉంటాయని, విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని లైట్‌ తీసుకుంటున్నారని తెలిసింది. అందివచ్చిన అవకాశాలు ఒడిపట్టుకోవాలని సమాధానం చెబుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అవకాశం వచ్చినప్పుడు ఆ మాత్రం అందిపుచ్చుకోమా..? అంటూ అంటుండటం ఎమ్మెల్యే వర్గంలో మరింత  అగ్గి రాజేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement