సీఎం ఢిల్లీ టూర్ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం
ఎంత సాన్నిహిత్యం లేకపోతే పదేపదే
ఎలా కలవగలుగుతారని ప్రశ్నిస్తున్న విశ్లేషకులు
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, అమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి బుధవారం సీఎం చంద్రబాబును కలిశారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో సునీత దంపతులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల కాలంలో సీఎంతో నర్రెడ్డి దంపతులు తరచూ ప్రత్యేకంగా సమావేశమౌతున్నారు. ప్రతినెలా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ దొరకడం, వీళ్లు కలవడం చర్చనీయాంశమవుతోంది. ఎంత సాన్నిహిత్యం లేకపోతే సీఎంను అలా పదే పదే నెలనెలా అత్యవసరంగా కలవగలుగుతారు అని విశ్లేషకులంటున్నారు. అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసు గురించి 3వ తేదీన తెలిస్తే.. 1వ తేదీనే ఎల్లో మీడియా శివాలెత్తింది. రాష్ట్రంలో ఈడీ అధికారుల నోటీసులు, వాటి గురించి ఎల్లో మీడియాలో ముందే కథనాలు రావడం అందరూ గమనిస్తున్నవే. ఈడీ నోటీసులు, దాడులకు సంబంధించిన వివరాలు ముందుగా ఎల్లో మీడియాలో ‘ఎక్స్‌క్లూజివ్’ వార్తల పేరిట బయటకు వస్తున్నాయని, ఆ తర్వాత కొన్ని గంటల్లోనే దాదాపు అదే ప్రకారం ఈడీ చర్యలు సాగుతుండడం అనుమానాలకు తావిస్తోందని విశ్లేషకులంటున్నారు. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు అందగానే వివేకా కుమార్తె సునీత చంద్రబాబును కలవడం వీరి కుట్రపూరిత రాజకీయ బంధానికి తిరుగులేని నిదర్శనమని విమర్శకులంటున్నారు.
టీడీపీ జడ్పీటీసీగా అనురాగ్....
మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తిరిగిన సునీత దంపతులకు టీడీపీ అధినేత ఇంతలా ఎలా సన్నిహితం అయ్యారనేది బహిరంగ రహస్యమే. టీడీపీలో లేకపోయినా సునీత దంపతులకు జడ్పీ ఛైర్మన్ పీఠం నజరానాగా దక్కింది. సునీత దంపతులు జడ్పీ ఛైర్మన్‌గిరి కోరడం, ఆమేరకు సీఎం చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించడం తెల్సిందే. సునీత భర్త రాజశేఖరరెడ్డి సోదరుడు శివప్రకాష్ రెడ్డి కుమారుడు నర్రెడ్డి అనురాగ్‌రెడ్డిని బరిలో నిలిపేందుకు అంతా సిద్ధమయ్యింది. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా అనురాగ్‌రెడ్డి పోటీ చేయనున్నారు. ఇప్పటికే ఆయన మండలంలో పలువురి మద్దతు కోరుతున్నారు. నర్రెడ్డి దంపతులు టీడీపీ అధిష్టానంతో టచ్‌లో ఉండి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.


