సాక్షి, తాడేపల్లి: ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనమైందని వైఎస్సార్‌సీపీ నాయకులు దేవినేని అవినాష్ ఆరోపించారు. సీపీగా రాజశేఖర్ బాబు వచ్చాక విజయవాడ గాడి తప్పిందని సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా జరగని ఘోరం విజయవాడలో జరిగింది. పోలీసులే యువకుడిని కొట్టి చంపేసి, కాల్చి బూడిద చేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు.
గాదె సాయికృష్ణ ఘటనపై దేవినేని అవినాష్ స్పందిస్తూ..‘విజయవాడ నగరంలో పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. రెండేళ్లుగా గంజాయి విక్రయాలు, సెటిల్మెంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. నగరంలో లా అండ్ ఆర్డర్‌ని సీపీ రాజశేఖర్ బాబు గాలికి వదిలేశారు. దర్జాగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతుంటే సీపీ పట్టించుకోవడం లేదు. రౌడీ షీటర్స్ నడిరోడ్డుపై ప్రజల్ని ఇబ్బంది పెడుతూ దర్జాగా తిరుగుతున్నారు. పేకాట క్లబ్‌లు విచ్చలవిడిగా నడుస్తున్నా సీపీ పట్టించుకోరు.
సాయికృష్ణ ఘటన సీపీకి తెలిసే జరిగింది. సీపీ బాధ్యత వహించాలి సమాధానం చెప్పాలి. సీపీ ఎందుకు మాట్లాడటం లేదు?. వైఎస్సార్‌సీపీ నేతల్ని వేధించడంలో సీపీ రాజశేఖర్ బిజీగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ కళ్లలో ఆనందం చూడటానికే సీపీ పని చేస్తున్నాడు. సీఎం, డిప్యూటీ సీఎం సమావేశమై బాధిత కుటుంబానికి ఏం న్యాయం చేశారు?. మీ పార్టీల జెండాలు పట్టుకుని ఎన్నికల్లో తిరిగిన కుటుంబానికి మీరు ఇచ్చిన భరోసా ఏది?. సాయికృష్ణను కొట్టి చంపేసి కాల్చి బూడిద చేశారు. ఇదే నిజం. బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కనీసం పరామర్శించలేదు. జనసేన ఇంచార్జ్ అమ్మిశెట్టి వాసు ఏకంగా డబ్బులిస్తామని సెటిల్మెంట్ చేస్తున్నాడు’ అంటూ విమర్శలు గుప్పించారు.


