‘అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం’ | YS Jagan Slams Chandrababu Over Smart Kitchens Plan | Sakshi
Sakshi News home page

‘అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం’

Jun 27 2026 12:48 PM | Updated on Jun 27 2026 3:00 PM

YS Jagan Slams Chandrababu Over Smart Kitchens Plan

సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న వేలాది మంది అక్కచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 'స్మార్ట్‌ కిచెన్స్‌' పేరుతో పార్టీ అనుచరుల పొట్టలు నింపుతూ, దాదాపు 85 వేల మంది మహిళలను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని అన్నారాయన.

ఈ మేరకు శనివారం 'ఎక్స్‌' వేదికగా వైఎస్‌ జగన్‌ స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత 20 ఏళ్లకు పైగా మధ్యాహ్న భోజనం వండుతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారని, అలాంటి వారి ఉపాధిని ఒక్కసారిగా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

మధ్యాహ్న భోజన కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని జగన్‌ అంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇంకా మెరుగైన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోకుండా, స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో వారినే తొలగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున వైఎస్సార్‌సీపీ పోరాడుతుందని, వారికి అండగా నిలుస్తుందని జగన్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే బకాయిపడ్డ రెండు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు వారి వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడితే వేలాది పేద మహిళల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని జగన్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement