బిహార్‌ రాజకీయాల్లో పెను సంచలనం | Why Lalu Yadav's Daughter Rohini Acharya Quits Politics And Cuts Ties With Family, Know What She Said | Sakshi
Sakshi News home page

బిహార్‌ రాజకీయాల్లో పెను సంచలనం

Nov 15 2025 4:21 PM | Updated on Nov 15 2025 4:56 PM

Why Lalu Yadavs Daughter Rohini Acharya Quits Politics What She Said

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే.. బిహార్‌ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకుంది. ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబంలో తీవ్ర ముసలం బయటపడింది. ఆయన తనయ రోహిణి ఆచార్య శనివారం రాజకీయాలకు గుడ్‌ బై ప్రకటించారు. అంతేకాదు.. కుటుంబంతోనూ సంబంధాలు తెంచుకుంటున్నట్లు బహిరంగ ప్రకటన చేశారామె. 

‘‘రాజకీయాలను వదిలేయడంతో పాటు కుటుంబంతో సంబంధాలు కూడా తెంచుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ కోరుకుంది ఇదే. పూర్తి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. సంజయ్‌ యాదవ్‌ తేజస్వి యాదవ్‌ సలహాదారు కాగా.. రమీజ్‌ ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

లాలూ తనయ అయిన రోహిణి ఆచార్య డాక్టర్‌ కూడా. తన భర్త, పిల్లలతో సింగపూర్‌లో ఆమె స్థిరపడ్డారు. 2022లో తండ్రి లాలూకి తన కిడ్నీ దానం చేయడం ద్వారా అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.  ఆ సమయంలో అదంతా డ్రామా అంటూ ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే దానిని నిరూపించాలంటూ విమర్శకులకు ఆమె ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె సరన్‌ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ చేతిలో ఓడారు.

ఆ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయంగా క్రియాశీలకంగానే వ్యవహరించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సింగపూర్‌ నుంచి వచ్చి మరీ ఆమె సోదరుడు తేజస్వీ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో హర్యానాకు చెందిన ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ యాదవ్‌తో ఆమెకు విబేధాలు మొదలయ్యాయి. తన సోదరుడిని, తనను సైతం పక్కన పెడుతూ పార్టీ వ్యవహారాల్లో సంజయ్‌ అతిజోక్యం చేసుకోవడాన్ని ఆమె భరించలేకపోయారు. ఓటర్‌ అధికార్‌ యాత్రలోనూ సంజయ్‌ వ్యవహార శైలిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఆ సమయంలో తేజస్వి సోదరికి మద్ధతుగా నిలవకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే.. 

అనూహ్యంగా.. లాలూ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ సోదరికి మద్ధతుగా నిలిచారు. తన సోదరిని అవమానించినవాళ్లపై కృష్ణుడిలా సుదర్శన చక్రం ప్రయోగిస్తానంటూ ఓ వ్యాఖ్య కూడా చేశారాయన. ఈలోపు.. తేజస్వి యాదవ్‌తో పాటు కుటుంబానికి, పార్టీకి చెందిన పలువురు ప్రముఖులను సోషల్‌ మీడియాలో రోహిణి అన్‌ఫాలో చేయడం ఆ మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె తాజా నిష్క్రమణపై ఆర్జేడీ స్పందించాల్సి ఉంది. 

తేజ్ ప్రతాప్ vs తేజస్వీ
లాలూ కొడుకులు తేజ్ ప్రతాప్ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ల మధ్య చాలాకాలంగా విబేధాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితాన్ని తేజ్‌ ప్రతాప్‌ నెట్టింట పెట్టడంతో.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడంటూ ఎన్నికల ముందు ఆర్జేడీ బహిష్కరించింది. దీంతో జనశక్తి జనతా దళ్ (JJD) అనే కొత్త పార్టీ ప్రారంభించి మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

అయితే.. వీళ్ల విబేధాలే ఆర్జేడీలో అంర్గత సంక్షోభానికి దారి తీశాయని.. NDA పార్టీలు ఈ విభేదాలను ప్రచారంలో హైలైట్ చేశాయని.. వెరసి ఘోర ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అక్కడి విశ్లేషకులు భావిస్తున్నారు. వయోభారంతో బాధపడుతున్న లాలూ, ఈ రాజకీయ సంక్షోభాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారే తప్ప ఏం చేయలేకపోయారనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement