
ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఒక ఎన్నికలా?
రిగ్గింగ్‌కు పాల్పడి, అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచిన టీడీపీ సంబరాలు చేసుకోవడం ఏమిటి?
సాధారణంగా ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా స్వేచ్ఛగా ఓటేసేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు
తొలిసారిగా ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర బాబుదే
అధికార టీడీపీ అరాచకాలను ఎండగడుతున్న ప్రజాస్వామికవాదులు, రాజకీయ విశ్లేషకులు
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ విజయం
కళ్లు మూసుకుని కూర్చున్న ఎన్నికల కమిషన్
సాక్షి ప్రతినిధి, కడప, సాక్షి రాయచోటి: ‘‘అసలు ప్రతిపక్షానికి చెందిన ఏజెంట్లే లేకుండా జరిగిన ఈ ఎన్నికలు ఒక ఎన్నికలా..? ఏ ఒక్క బూత్‌లోనూ విపక్ష ఏజెంట్లను రానివ్వకుండా రిగ్గింగ్ చేసి, అనైతికంగా పోలీసుల సాయంతో గెలిచి సంబరాలు చేసుకోవడం ఏమిటి? ప్రపంచ చరిత్రలో ఏ ఎన్నికా ఇలా జరిగి ఉండదు...!’’ అని ప్రజాస్వామికవాదులు, రాజకీయ విశ్లేషకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘దేశంలో ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు పోలీసు వ్యవస్థను వినియోగిస్తారు. కానీ మొట్టమొదటిసారి ప్రజలు ఓట్లు వేయకుండా ఉండేందుకు పోలీసులను వాడిన దుర్మార్గమైన చరిత్ర చంద్రబాబు సర్కారుది..’ అని వ్యాఖ్యానిస్తున్నారు.
కళ్లు మూసుకున్న ఎన్నికల కమిషన్!
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అడ్డదారిలో టీడీపీ గట్టెక్కింది! ఎన్నికల ముందు తాలిబన్లు, బందిపోటు ముఠాల మాదిరిగా అటకాయించి వైఎస్సార్ సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులకు తెగబడటంతో మొదలైన పచ్చముఠాల అకృత్యాలు ఎన్నికల రోజు మరింత యథేచ్ఛగా సాగాయి. అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని కొమ్ము కాసే పోలీసుల సహకారంతో ప్రభుత్వ పెద్దలు ఎన్నికల అరాచకాలకు బరి తెగించారు.
టీడీపీ నేతలు ఎన్నికల ముందు రోజు రాత్రే వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్ల ఇళ్ల వద్దకు చేరుకుని వారు బయటకు రాకుండా మోహరించారు. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారితో దొంగ ఓట్లు వేయించారు. దేశ చరిత్రలో తొలిసారిగా అసలు విపక్ష పోలింగ్ ఏజెంట్లే లేకుండా చేసి అధికార పార్టీ అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడినా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుని కూర్చుంది.
ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారు. వైఎస్సార్ సీపీ నేతలపై బైండోవర్ కేసులు మొదలు హత్యాయత్నం, కౌంటర్ కేసులు బనాయించి అరెస్టులు చేసుకుంటూ వెళ్లారు. పట్టపగలు నల్లగొండువారిపల్లె గ్రామం మధ్యలో ప్రజలంతా చూస్తుండగా ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగితే నిందితులను ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదు.
పైగా కౌంటర్ కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలింగ్ రోజు వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు బూత్‌ల వద్దకు రాకుండా దగ్గరుండి మరీ అడ్డుకుని టీడీపీ గూండాలకు సహకారం అందించారు. ఏకంగా డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే తిష్ట వేసి ఈ అరాచకాలను పర్యవేక్షించడం విస్మయం కలిగిస్తోంది.
ఒంటిమిట్టలో మంత్రి సమక్షంలోనే దాడులు..
ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 10.30 వరకు సాఫీగా సాగినా ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు పసిగట్టిన పచ్చముఠాలు బూత్‌లను ఆక్రమించుకుని దౌర్జన్యాలకు తెగబడ్డాయి. ఏకంగా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి సమక్షంలోనే వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై దాడులకు దిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.
టీడీపీ గూండాలను వారించకపోగా.. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలను రాకుండా కట్టడి చేయడంతో అధికార పార్టీ బూత్‌లలో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసుకుంది. పోలింగ్ రోజంతా విచ్చలవిడిగా సాగిన టీడీపీ మూకల రిగ్గింగ్, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన దొంగ ఓటర్లతో జాతరను తలపించింది. ఉదయం పోలైన ఓట్లలో ఎక్కువ శాతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి వచ్చినట్లు తెలుస్తోంది.
తర్వాత పచ్చ ముఠాలు అక్రమాలకు బరి తెగించాయి. ఓటర్ల నుంచి స్లిప్పులు లాక్కుని దొంగ ఓట్లు వేశాయి. సాయంత్రం వరకు విపక్ష ఏజెంట్లు లేకుండా ఈ డ్రామా సాగింది. ఈ అరాచకాలు, అక్రమాలు, ఏకపక్ష ఎన్నికలను నిరసిస్తూ కడపలో జరిగిన కౌంటింగ్‌ను వైఎస్సార్ సీపీ అభ్యర్థితోపాటు ఏజెంట్లు బహిష్కరించారు.
అభాసుపాలైన ఎస్‌ఈసీ..
జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరుతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అభాసుపాలైంది. ఓటర్లు నాలుగైదు కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఓట్లు వేయాల్సి వచ్చేలా పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేసినా ఏమీ పట్టనట్లు కళ్లు మూసుకుంది. టీడీపీ నాయకులు దొంగ ఓటర్ల అవతారం ఎత్తిన వైనం మీడియా, సామాజిక మాధ్యమాల్లో రోజంతా వైరల్ అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
చివరకు మహిళలవి కూడా దొంగ ఓట్లు పోలయ్యాయి. పులివెందులలో 3,684 మంది మహిళలు ఓట్లు వేసినట్లు నమోదైంది. వెబ్ కాస్టింగ్ పరిశీలిస్తే బోగస్ బాగోతం వెల్లడవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వ్యవస్థలన్నీ కుమ్మక్కై రౌడీ రాజ్యానికి పట్టం కట్టారని పులివెందుల ప్రజలు పేర్కొంటున్నారు.
ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా?
సాక్షి, అమరావతి: ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అందుకే కౌంటింగ్ ప్రక్రియను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించామని ఒంటిమిట్ట వైఎస్సార్ సీపీ అభ్యర్థి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఒంటిమిట్టలో ఉదయం 11 గంటల వరకు మాత్రమే ఎన్నికలు సజావుగా జరిగాయని, ఆ తరువాత టీడీపీ నేతలు పోలీస్ ప్రొటెక్షన్‌తో రిగ్గింగ్ చేసుకుని దొంగ ఓట్లు వేసుకున్నారని వెల్లడించారు.
ఈ రెండు ఉప ఎన్నికలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒంటిమిట్ట, పులివెందులలో ఏ గ్రామానికి వెళ్లినా వేలికి సిరా గుర్తు లేని వారే కనిపిస్తారని చెప్పారు. ప్రతి గ్రామానికి వెళ్లి ఓటర్లకు సిరా గుర్తు ఉందో లేదో విచారణ చేయాలని కోరారు. గ్రామాలకు వచ్చి నిజమైన ఓటర్లతో మాట్లాడే ధైర్యం ఉందా? అని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.
పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలు టీడీపీకే
కడప సెవెన్‌రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం కడప శివార్లలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల హేమంత్‌రెడ్డికి 683 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,716 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె 6,033 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 6,513 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి 6,267 ఓట్ల మెజారీ్టతో గెలుపొందారు.