కొత్త సంవత్సరం జోష్ మాటున దోపిడీ
అర్ధరాత్రి ఒంటి గంట వరకు విక్రయాలకు అనుమతి
రెండ్రోజుల్లో రూ.500 కోట్ల మద్యం అమ్మకాలే లక్ష్యం
సీసాపై ఎంఆర్‌పీ కంటే రూ.50 అధికంగా బాదుడు
తద్వారా మరో రూ.100 కోట్ల అదనపు దోపిడీకి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: మద్యం అమ్మకాలపై ‘న్యూ ఇయర్ సెస్’ వసూళ్లకు సర్కారు అనధికారిక అనుమతులు ఇచ్చేసింది. ఈ కానుకతో కొత్త సంవత్సరంతో ‘కిక్కే.. కిక్కు’ అంటోంది టీడీపీ మద్యం సిండికేట్. రాష్ట్రంలో మద్యం విక్రయాల వ్యవస్థను గుప్పెట పట్టిన టీడీపీ సిండికేట్ నూతన సంవత్సర వేడుకలను అవకాశంగా చేసుకుని మరింత దోపిడీకి తెగబడింది.
అదనపు విక్రయ సమయాలకు ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపగా.. అనధికారిక వసూళ్లకు కూడా సై అంది. తద్వారా రెండ్రోజుల్లోనే రూ.500 కోట్ల మద్యం అమ్మకాలు, అనధికారికంగా మరో రూ.100 కోట్లు కొల్లగొట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కరకట్ట బంగ్లా కనుసన్నల్లో రాష్ట్రంలో సాగుతున్న మద్యం దోపిడీ విధానంలో కొత్త అంకానికి తెరలేచింది. ఇకపై ఏ పండుగ వచ్చినా ఇదే విధానమని స్పష్టమైన సంకేతాలిచ్చింది.
క్వార్టర్ బాటిల్‌పై రూ.50 బాదుడు
కొత్త ఏడాది వేడుకలను టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీకి మరో అవకాశంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చేసింది. అందుకోసమే బుధ, గురువారాల్లో ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, అర్ధరాత్రి ఒంటిగంట వరకు బార్లలో మద్యం విక్రయాలకు అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఎందుకంటే రాష్ట్రంలోని 3,336 మద్యం దుకాణాలు, 540 బార్లు టీడీపీ సిండికేటే ఏకపక్షంగా దక్కించుకుంది.
దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలను అనధికారికంగా ఏర్పాటు చేసి ఊరూ వాడా మద్యం ఏరులై పారిస్తోంది. అంటే మొత్తం మద్యం వ్యవస్థ అంతా టీడీపీ సిండికేట్ గుప్పెట్లోనే ఉంది. ఇప్పటికే బాటిల్‌పై ఎంఆర్‌పీ ధర కంటే రూ.10 చొప్పున అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా బుధ, గురువారాల్లో మద్యం ధరలను అనధికారికంగా అమాంతం పెంచేశారు.
‘న్యూ ఇయర్ సెస్’ అంటూ అనధికారికంగా క్వార్టర్ బాటిల్‌పై రూ.50 అదనంగా వసూలు చేయాలని సిండికేట్ నిర్ణయించింది. అంటే ఫుల్ బాటిల్‌పై రూ.200 ధర పెంచేసినట్టే. ఇక బీర్ బాటిల్‌పై కూడా రూ.50 అనధికారికంగా పెంచేశారు. ఆ ప్రకారమే బుధవారం ఉదయం నుంచే మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి వరకు ఈ న్యూ ఇయర్ హంగామా దోపిడీ కొనసాగనుంది.
రెండ్రోజుల్లో రూ.500 కోట్ల అమ్మకాలే లక్ష్యం
బుధ, గురువారాల్లో మద్యం విక్రయాలు ఎంతగా పెరిగితే.. అంతగా దోపిడీ చేయవచ్చని టీడీపీ సిండికేట్ గుర్తించింది. అందుకే మద్యం విక్రయాల సమయాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఇక సాధారణ రోజుల్లో ఎంఆర్‌పీ ధరల ప్రకారం రాష్ట్రంలో రోజుకు దాదాపు రూ.90 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగుతున్నాయి. 2025 జనవరి 1న రూ.147 కోట్ల మద్యం, 2025 సంక్రాంతి రోజున రూ.225 కోట్ల మద్యం విక్రయించారు.
ఇప్పుడు ఆ రికార్డులను తిరగ రాయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. డిసెంబర్ 31న అంటే బుధవారం ఒక్క రోజే రూ.300 కోట్ల మార్కు దాటించాలని స్పష్టం చేసింది. జనవరి 1న విక్రయాలు కలిపి రూ.500 కోట్ల మద్యం విక్రయించాలని ఎక్సైజ్ అధికారులకు అనధికారికంగా టార్గెట్ ఇచ్చింది. వారం రోజులుగా ఎక్సైజ్ శాఖ మొత్తం అదే పనిలో నిమగ్నమైంది. ఎంత వీలైతే అంతగా తాగించేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తోంది. రాష్ట్రంలోని బీచ్‌లలోని కూల్‌డ్రింక్స్ షాపులు, పల్లెలు, పట్టణాల్లోని కిళ్లీ కొట్లు, కిరాణా కొట్లను కూడా బెల్ట్ దుకాణాలుగా చేసేసుకోవాలని సిండికేట్‌కు పచ్చ జెండా ఊపింది.
సూర్యలంక బీచ్‌లో కూల్‌డ్రింక్ దుకాణాల్లో బహిరంగంగానే మద్యం విక్రయిస్తుండటం గమనార్హం. రాష్ట్రం అంతా అదే పరిస్థితి నెలకొంది. కాగా న్యూ ఇయర్ స్పెషల్‌గా క్వార్టర్ బాటిల్‌పై రూ.50, బీరు బాటిల్‌పై రూ.50 అదనపు దోపిడీ ద్వారా మరో రూ.100 కోట్లు కొల్లగొడతారని అంచనా. తద్వారా మద్యం విక్రయాల అసలు విలువ రూ.600 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు.
కరకట్ట బంగ్లా కనుసన్నల్లోనే..
రాష్ట్రంలో టీడీపీ మద్యం సిండికేట్ అంతా కరకట్ట బంగ్లా కనుసన్నల్లోనే సాగుతోందన్నది బహిరంగ రహస్యం. అందుకోసమే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. ఆ స్థానంలో ఏర్పాటు చేసిన రాష్ట్రంలోని మొత్తం 3,336 మద్యం దుకాణాలు, 540 బార్ల లైసెన్సులను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కేటాయించింది.
రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి మద్యం బాటిల్‌పై రూ.5 చొప్పున కరకట్ట బంగ్లాకు చేరుతోంది. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35వేల కోట్ల మద్యం విక్రయాలను ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించింది. ఇందుకు కొత్త సంవత్సరం, సంక్రాంతి, ఇతర పండుగల సీజన్‌ను వాడుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.


