జీవోలను సైతం గోప్యంగా ఉంచడంలో మతలబు ఏమిటి?
బాబు, లోకేశ్ విదేశీ పర్యటనపై ఎన్నో సందేహాలు
సోషల్ మీడియాలో హోరెత్తుతున్న విమర్శలు
సాక్షి, అమరావతి: పారదర్శకతకు పాతరేసి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ రహస్యంగా విదేశీ పర్యటనలు చేయడం దుమారం రేపుతోంది. జీవోలను సైతం గోప్యంగా ఉంచి విదేశాల్లో రహస్యంగా పర్యటిస్తుండటంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన పర్యటనకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచడం ఏమిటనే ప్రశ్నకు అటు టీడీపీ నుంచి గానీ, ఇటు ప్రభుత్వం నుంచి గానీ సరైన సమాధానం రావడం లేదు. గత నెల 30న ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తన సతీమణితో కలిసి విదేశాలకు వెళ్లారు. సాధారణంగా సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు ఎక్కడికి వెళ్లినా అధికారికంగా ఉత్తర్వులు ఇస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అఖిల భారత సర్వీసు సహా వివిధ స్థాయి అధికారులు అధికారిక విధుల్లో భాగంగా ఒక్కరోజు ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు వెళ్లినా అందుకు సంబంధించిన వివరాలతో జీవోలు వెలువడతాయి.
సీఎం వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా అందుకు సంబంధించిన జీవోలు జారీ చేస్తారు. సీఎం పర్యటన ఉంటే భద్రతా ఏర్పాట్లు చాలా ఉంటాయి కాబట్టి అందుకోసమైనా వివరాలు వెల్లడిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం జీవోను బయట పెట్టకుండా విదేశీ పర్యటనకు వెళ్లారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు హోరెత్తుతున్నాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం ఏమిటని రాజకీయ, మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. సీఎం హోదాలో చంద్రబాబు ఏమీ చెప్పకుండా విదేశాలకు వెళ్లడాన్ని టీడీపీ నేతలు సమర్థించుకుంటూ సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్ ఐదు రోజుల క్రితమే రహస్యంగా విదేశాలకు వెళ్లారు. ఆయన ఎక్కడికి వెళ్లారనే వివరాలు కూడా బయట పెట్టలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా గుడ్డిగా సమర్థించుకోవడం తప్ప, తాము ప్రజలకు జవాబుదారీ అనే విషయాన్ని మరచిపోయి టీడీపీ శ్రేణులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి.


