రిషికొండే గుదిబండా?.. అమరావతి సంగతేంటి! | TDP and Yellow Media Fake News on YS Jagan Rushikonda Buildings | Sakshi
Sakshi News home page

రిషికొండే గుదిబండా?.. అమరావతి సంగతేంటి!

Oct 8 2026 11:33 AM | Updated on Oct 8 2026 11:37 AM

TDP and Yellow Media Fake News on YS Jagan Rushikonda Buildings

ఏపీలో ఎల్లో మీడియా ఎంత నీచంగా ప్రచారం చేస్తుందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ టైమ్‌లో విశాఖ రిషికొండపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భవనాలు ప్రభుత్వానికి గుదిబండగా ఉన్నాయని ఎల్లో మీడియా ఒక కధనాన్ని ఇచ్చింది. దానిని చదివితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంత అసమర్ధంగా ఉందా అన్న అభిప్రాయం కూడా వస్తుందని ఆ మీడియా  ఊహించి ఉండకపోవచ్చు. అదే టైమ్‌లో  విశాఖపై  ఎల్లో మీడియాకు ఇంత ద్వేషం ఉందా అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. రిషికొండ  భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో సర్కార్‌కు  అర్ధం కావడం లేదట.

రిషికొండ భవనాలే గుదిబండ అయితే మరి రాజధాని అమరావతి పేరుతో  అప్పులు తెచ్చి మరీ వేల కోట్ల వ్యయంతో చేస్తున్న నిర్మాణాలను దేనితో పోల్చాలి! రిషికొండలో మహా అయితే 400 కోట్లు ఖర్చు   పెట్టి ఉండవచ్చు. ఆ భవనాలు   సముద్ర తీరాన ఠీవిగా కనిపిస్తాయి. జాతీయ, అంతర్జాతీయ నేతలు ఎవరైనా విశాఖకు వస్తే అక్కడ వారికి విడిది వసతి పెట్టడం గొప్పగా ఉంటుందని అప్పట్లో ఆ ప్రభుత్వం తలచింది. కాని తదుపరి  అనూహ్యంగా కూటమి అదికారంలోకి వచ్చింది. దాంతో రిషికొండకు గ్రహణం పట్టించారు. ఇప్పటికి దాదాపు రెండున్నరేళ్లకాలం పూర్తి అవుతున్నా, ఆ భవనాలను ఎలా వినియోగించాలన్నదానిపై  ఒక నిర్ణయానికి రాలేకపోయారంటే ఏమనుకోవాలి! ఎంతసేపు ఆనాటి ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ అవసరాల కోసం నిర్మించారని దుష్ప్రచారం చేయడం తప్ప మరేమీ చేయలేకపోతోంది. 

ప్రభుత్వ గెస్ట్ హౌస్‌గా వాడుకోవచ్చు , లేదా మరేదైనా ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చు. కాని ఆ భవనాలను ఏమి చేయాలో తెలియడం లేదని  ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అంటున్నారంటే ఆయన సీనియారిటీ అంతా ఏమైనట్లు అనుకోవాలి! రుషులు బస చేసిన కొండ అంటూ చంద్రబాబు  సెంటిమెంట్ డైలాగులు చెబుతారు. ఆ భవనాలను ప్రైవేటు హోటళ్లకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పుడు ఈ సెంటిమెంట్ ఏమవుతుందో తెలియదు. చంద్రబాబు ఎంతసేపు ప్రైవేటువారికి అందలం వేస్తారన్న అభిప్రాయానికి తగ్గట్లుగానే ఆలోచన చేశారన్నమాట. అది కూడా ఒక కొలిక్కి రాలేదు. వారు ఇంకా అదనంగా భూమి కోరారట. ఇప్పుడు దానిని సమకూర్చడం కోసం ప్లాన్ చేస్తోంది.

నేరుగా ఆ భూమి కూడా కేటాయిస్తే విమర్శలు వస్తాయి కనుక, ముందుగా జగన్ పై వీలైనంత బురదచల్లి, ఆ తర్వాత కామ్ గా తన పని కానివ్వాలని భావిస్తున్నట్లు  ఉన్నారు. టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కూడా ఆ భవనాల నిర్మాణం క్రిమినల్ వేస్టు అని  అన్నారట. నిజానికి భవనాలు సిద్దంగా ఉన్నప్పటికీ, చేతకానితనంతో వాడుకోలేకుండా వృధాగా పెట్టడం క్రిమినల్ వేస్టే అన్నది అనుభవజ్ఞలు వ్యాఖ్యగా ఉంది. వైసిపి ప్రభుత్వంలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఒక అసత్యాన్ని ఎల్లో మీడియా ప్రచారంలోకి తెస్తోంది. 

అదే నిజమైతే డేటాసెంటర్ల పేరుతో పది కొండలను గుండు కొట్టినట్లే కాదు.. సింహాచలం కొండతో సహా మొత్తం కొండలే కనిపించకుండా అన్నట్లు తవ్వేస్తున్నారు కదా!దానికి ఏ పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది?విశాఖకు అన్ని డేటా సెంటర్లతో, నీరు,  విద్యుత్ ,కాలుష్యం తదితర సమస్యలు వస్తాయని మేధావులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం వినడం లేదే! ఎల్లో మీడియా శరభ, శరభ అంటూ కూటమి ప్రభుత్వానికి భజన చేస్తోందే!పర్యావరణ నిబంధనలకు పూర్తి విరుద్దంగా కృష్ణా నది గర్భంలో నిర్మించిన ప్రజావేదిక తాత్కాలిక కట్టడాన్ని గత ప్రభుత్వం కూల్చితే దానిని విధ్వంసం అని విష ప్రచారం చేశారే. 

అంటే ఎల్లో మీడియాకు ఇష్టమైతే పర్యావరణంతో సంబంధం లేకుండా ఏమైనా చేయవచ్చు. లేకపోతే టీడీపీ కోసం పచ్చి అబద్దాలతో బురద చల్లుతుందన్నమాట. అంతేకాదు. మూడు పంటలు పండే వేలాది ఎకరాల భూమిని రాజధాని నిమిత్తం తీసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికార కమిటీ సూచిస్తే, ఆ కమిటీనే దూషించారే. ఆ నివేదికనే పక్కనబెట్టారే! ఇలా ఎన్ని ఉదాహరణలనైనా చెప్పవచ్చు. రిషికొండ భవనాలకు పర్యావరణ అనుమతులు లేవంటూ వేసిన పిటిషన్‌లను హైకోర్టు  అప్పుడే కొట్టేసింది. ఆనాటి మంత్రి రోజా ఆ భవనాలను ప్రారంభించారు కూడా. అయినా ఆ భవనాలను లీజుకు ఇవ్వరాదంటూ మళ్లీ పిటిషన్ లు వేశారట. 

అది వేసింది టీడీపీ నేతలేకదా! వారితో వాటిని ఉపసంహరింప చేయడం కూడా టీడీపీ నాయకత్వానికి కుదరదా!అంటే ఏదో వంకతో భవనాలు వేస్ట్ గా ఉంచి, జగన్ పై తప్పుడు ప్రచారం చేయడమే వీరి లక్ష్యం అన్న భావన కలగదా! అదే టైమ్ లో  తమకు కావల్సినవారికి ఆ భవనాలను, అక్కడే ఉన్న మరో తొమ్మిది ఎకరాలను కట్టబెట్టడానికి ప్లాన్ చేశారట. అప్పుడు రుషులు తపస్సు చేసుకోకుండా వెళ్లిపోయానా ఫర్వాలేదా! నిజానికి ఎప్పటినుంచో రిషికొండపై టూరిజం భవనాలు  ఉన్నాయి. వాటి స్థానంలో అదునాతన భవనాలను జగన్ ప్రభుత్వం  నిర్మించింది. 

విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేసి , దానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తేవడంలో భాగంగా భవనాలు నిర్మించడానికి జగన్ చేసిన కృషిని నిర్వీర్యం చేసే  పనిలో ప్రస్తుత ప్రభుత్వం ఉందన్నమాట. ఒక ఐటి కంపెనీ కూడా ఈ భవనాలు తీసుకోవడానికి  ముందుకు వచ్చిందని, కాని హైకోర్టులో కేసుల వల్ల లీజుకు ఇవ్వలేకపోతున్నామని లోక్ సభ సభ్యుడు భరత్ అన్నారు. మరో వైపు మంత్రి దుర్గేష్ మాత్రం త్వరలోనే ఈ భవనాలను వినియోగంలోకి తెస్తామని అన్నారు. ఇన్ని కబుర్లు చెప్పే కూటమి పెద్దలు, ఎల్లో మీడియా అమరావతిలో జరిగే పర్యావరణ  విధ్వంసం గురించి మాత్రం మాట్లాడరు. పైగా అదో అధ్బుతమని ప్రచారం చేస్తారు.కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో వేల ఎకరాల భూమి వరద నీటితో మునిగిపోయింది.

వరద కారణంగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని మీడియాలో కధనాలు వచ్చాయి. కేవలం వరద నియంత్రణ ప్రాజెక్టులకోసమే వందల కోట్లు వెచ్చిస్తున్నారు. సచివాలయ టవర్ల భవనాల అద్దాలకు 2500 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. అమరావతిలో జరుగుతున్న అవినీతిపై ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయాలని అమరావతి జేఏసీ రైతులు కోరారంటేనే  పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. గ్రామకంఠాల విషయంలో వారు అధికారుల తీరుతెన్నులను ఎంతగా తప్పుపట్టారో అందరికి తెలిసిందే. అమరావతిలో డబ్బు ఉన్నవారికి ఒక న్యాయం, లేనివారికి మరో న్యాయం జరుగుతోందని కూడా వారు ధ్వజమెత్తారు. వీటిపై మాత్రం వార్తలు ఇవ్వని ఎల్లో మీడియా రోజుకో కధ అల్లి, అమరావతిలో ఏదో జరిగిపోతుందన్న భ్రమ కల్పించడానికి నానా పాట్లు పడుతుంటుంది. అందులో  భాగంగా  ఏ చిన్న  డెవలప్‌మెంట్ ఉన్నా ఆహో, ఓహో అంటూ ఊదరగొడుతుంటుంది. 

ఐదెకరాలలో అమెజాన్ అడవిని సృష్టించబోతున్నట్లు రాసిన ఘనత కూడా ఎల్లోమీడియాదే. విజయవాడకు అమరావతిని అనుసంధానం చేస్తూ జల ప్రాజెక్టును చేపడతారట. వీటిలో ఎన్ని కార్యరూపం దాల్చుతాయో, ఎన్ని దాల్చవో తెలియదు కాని, ఎల్లో మీడియాలో వచ్చే కధనాలు చూస్తే  ఇప్పటికే అమరావతి ప్రపంచస్థాయి నగరం అయిపోయిందేమో అని జనం భ్రమపడవలసిందే. జగన్ ప్రభుత్వ టైమ్ లో విశాఖపై ఎంత విద్వేష  పూరిత స్టోరీలను ఎల్లో మీడియా ప్రచారం చేసిందో గుర్తు చేసుకుంటేనే ఆశ్చర్యం కలుగుతుంది. అమరావతి రియల్  ఎస్టేట్ ప్రయోజనాల ముందు , విశాఖ నగర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఎల్లో మీడియాకు  పట్టవన్న సంగతి తెలుస్తూనే ఉంటుంది.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement